● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
● ప్రజావాణికి 96 వినతులు
కామారెడ్డి క్రైం: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 96 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్‌లు, ఇందిరమ్మ ఇళ్లు, బిల్లుల మంజూరుకు సంబంధించిన ఫిర్యాదులు, వినతులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అఽధికారులు వెంటనే పరిశీలించాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ మధుమోహన్, ఆర్డీవో వీణ, జెడ్పీ సీఈవో చందర్, కలెక్టరేట్ పాలనాధికారి మసూర్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
రేషన్ డీలర్‌పై చర్యలు తీసుకోండి
అవినీతి, అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్‌పై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని నిజాంసాగర్ మండలం వడ్డేపల్లికి చెందిన ద్యానబోయిన పండరి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో రేషన్ దుకాణం నడిపించే ఎల్లయ్య అక్రమాలపై తనతో పాటు గ్రామస్తులు కలిసి గత జనవరిలో నిజాంసాగర్ తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు క్షేత్రస్ధాయిలో విచారించి ప్రభుత్వ ఉద్యోగులు, మరణించిన వారి పేర్ల మీద రేషన్ బియ్యం నమోదు చేయడం, అంత్యోదయ కార్డులకు చక్కెర ఇవ్వకపోవడం, డీలర్‌గా ఉంటూ ఎన్నికల్లో ప్రచారాలు చేయడం లాంటివి చేసినట్లు అధికారులు తేల్చారని అన్నారు. నివేదికను గత నెల 9న బాన్సువాడ రెవెన్యూ డివిజనల్ కార్యాలయానికి పంపినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఆ డీలర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. వెంటనే డీలర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించారు.
బెదిరించిన వార్డు సభ్యుడిపై చర్యలకు డిమాండ్
మొరం అక్రమ దందాపై వార్తలు ప్రచురించినందుకు తనను బెదిరించిన వార్డు సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భిక్కనూర్‌కు చెందిన ఓ పత్రికా విలేకరి సాయి మణికంఠ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. మండలంలో జరుగుతున్న మొరం అక్రమ దందాపై తాను పనిచేసే పత్రికలో వార్తా కథనాన్ని రాయగా స్థానికంగా ఉండే ఓ వార్డు సభ్యుడు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. చట్ట ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.
ఎల్లారెడ్డిలో ఫిర్యాదులు నిల్
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి తహసీల్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమానికి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఎంపీడీవో ప్రకాష్, సీడీపీవో ప్రసన్న తదితరులున్నారు.


