విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
● 9వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం
● మార్చి 31వరకు ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు
బాన్సువాడ రూరల్: పాఠశాలల విద్యార్థుల ఆలోచనలకు పదును పెట్టి వారిని భావి భారత శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దాలనే గొప్ప సంకల్పంతో ఇస్రో విద్యార్థులకు ఆహ్వానం పలుకుతోంది. అంతరిక్ష సాంకేతిక అనువర్తనాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందించడమే లక్ష్యంగా యంగ్ సైంటిస్టు పేరుతో యువ విజ్ఞాన్(యువికా)కార్యక్రమాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తోంది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కామారెడ్డి జిల్లాలో 9వ తరగతి అభ్యసిస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా సైన్స్ అధికారి సిద్దిరామిరెడ్డి తెలిపారు.
ఎంపిక ఇలా..
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14,050 మంది విద్యార్థులు 9వ తరగతి అభ్యసిస్తున్నారు. ఈవిద్యార్థులందరూ తమ పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 1, 2026 నాటికి 9వ తగరతి చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు. 8వ తరగతిలో వచ్చిన మార్కులు ఆధారంగా 50 శాతం, 8వ తరగతి సైన్స్, సోషల్ సబ్జెక్టు మార్కుల ఆధారంగా 10 శాతం, ఆన్‌లైన్ క్విజ్‌లో విద్యార్థి ప్రతిభకు 10 శాతం, సైన్స్‌ఫేయిర్‌లో పాల్గొంటే 10 శాతం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు 5 శాతం, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 15శాతం వెయిటేజీ మార్కులు కేటాయించి అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికై న విద్యార్థులకు..
ఇందులో విద్యార్థులతో పాటు వారి కుటుంబ సభ్యుల్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లే అవకాశం కల్పిస్తారు. ఇస్రోకు చెందిన ఆహ్మదాబాద్, శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపురం వంటి కేంద్రాల్లో శిబిరాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఎంపికై న విద్యార్థులకు అంతరిక్ష పరిశోధన కేంద్రానికి చెందిన శాస్త్రవేత్తలతో ముఖాముఖి, చర్చావేదికలు, ప్రయోగశాల సందర్శన, అంతరిక్షశాస్త్రం, రాకెట్ ప్రయోగాలకు సంబంధించిన అంశాలపై ప్రాథమికంగా అవగాహన కల్పించనున్నారు.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 9వ తరగతి అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న సువర్ణ అవకాశం ఇది. భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్న ఆకాంక్ష కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
–సిద్దిరామిరెడ్డి, కామారెడ్డి జిల్లా సైన్స్ అధికారి


