● తెగుళ్ల బెడదతో ఎండిపోతున్న చెట్లు
● రాలిపోయిన పూత
ఎల్లారెడ్డి: షడ్రుచుల ఉగాది పచ్చడిలో ఈసారి చేదు మాయమయ్యేలా కనిపిస్తోంది. వేప పువ్వు కొరతే ఇందుకు కారణం. ఉగాది పచ్చడిని తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు రుచులతో తయారు చేస్తారు. ఇందులో తీపి కోసం బెల్లం, పులుపు కోసం చింతపండు, కారం కోసం పచ్చిమిరప లేదా మిరియాలు, చేదు కోసం వేపపువ్వు, వగరు కోసం మామిడిలను వినియోగిస్తారు. అయితే ఈసారి కొమ్మ ఎండు తెగులుతోపాటు కీటకాలు, ఫంగస్ ఆశించి చాలాచోట్ల వేప చెట్లు ఎండిపోతున్నాయి. వేపచెట్ల మొవ్వలు, చిగుర్లు, లేత కొమ్మలు, ఆకులు ఎర్రగా మారి రాలిపోతున్నాయి. పూత, కాయలు కుళ్లి పోతున్నాయి. దీంతో ఎల్లారెడ్డి పరిసర ప్రాంతాల్లో వేప పువ్వుకు కొరత ఏర్పడింది. ఈసారి వేపు పువ్వు లేకుండా ఉగాది పచ్చడి చేసుకోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేప చెట్లు ఎండిపోతున్న విషయమై జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రెడ్డిని సంప్రదించగా.. ఎండు తెగులుతోపాటు కీటకాలు, ఫంగస్ వల్ల వేప చెట్లు ఎండిపోతున్నట్లు గుర్తించామన్నారు. చెట్టులో ఎండిపోతున్న భాగాన్ని తొలగించి మాన్కోజెబ్‌తో కార్బన్‌డజిమ్ మిశ్రమాన్ని కలిపి పిచికారి చేస్తే చెట్లను కాపాడుకోవచ్చని పేర్కొంటున్నారు. అయితే వేప చెట్లకు మందు పిచికారి చేయించి రక్షించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
భిక్కనూరు: ప్రతి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా మహిళా శిశు సంరక్షణాధికారిణి ప్రమీల అన్నారు. బుధవారం ఆమె భిక్కనూరు రైతు వేదికలో టైలరింగ్ ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందిన మహిళలకు ఆమె సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ప్రతి మహిళ ఆయా రంగాల్లో తప్పనిసరిగా శిక్షణ పొంది ప్రావీణ్యత సాధించి ఉండాలన్నారు.అప్పుడే మహిళ తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతుందన్నారు. సర్పంచ్ బల్యాల రేఖ, ఈవో మహేష్‌గౌడ్, తదితరులున్నారు.


