ఇంధనం తాగేశారు..
ప్లాస్టిక్, స్క్రాప్‌నూ వదలట్లేదు..
ట్రేడ్ లైసెన్స్‌ల జారీలో గోల్‌మాల్...
పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన సానిటేషన్ విభాగానికి అవినీతి మరకలు అంటుకున్నాయి. కొందరు అధికారులు, సిబ్బంది కలిసి మున్సిపల్ ఖజానాకు కన్నం వేస్తూనే క్షేత్రస్థాయిలో కార్మికుల శ్రమనూ దోచుకుంటున్నారు. గతంలో ఈ విభాగంలో ఇద్దరు అధికారులు ఏసీబీకీ చిక్కారు. తాజాగా ఏసీబీ సోదాల్లో అవినీతి అక్రమాలు మరిన్ని బట్టబయలయ్యాయి. – కామారెడ్డి టౌన్
కామారెడ్డి బల్దియా సానిటేషన్ విభాగంలో 264 పారిశుద్ద్య కార్మికులు, వీరిని పర్యవేక్షించేందుకు 16 మంది జవాన్‌లు పనిచేస్తున్నారు. కొత్త పట్టణానికి ఒక రెగ్యులర్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉన్నారు. గతంలో స్క్రాప్‌ను అమ్ముకుని సస్పెన్షన్‌కు గురై మళ్లీ విధుల్లో చేరిన మరొకరిని పాతపట్టణానికి ఇన్‌చార్జి సానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా కేటాయించారు. ఈ విభాగంలో కార్మికుల హాజరుకు సంబంధించి రెండు రిజిస్టర్‌లను వినియోగిస్తున్నట్లు సమా చారం. పారిశుద్ధ్య కార్మికులలో కొందరు విధులకు హాజరు కాకపోయినా, హాజరు చూపిస్తున్నారు. ఇలా డుమ్మా కొట్టిన కార్మికుల జీతాల నుంచి అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఏసీబీ విచారణలో తేలింది. పని చేయకుండానే జీతం వస్తుండడంతో సదరు కార్మికులు కూడా వీరికి సహకరిస్తున్నారు.
డ్యూటీ కావాలంటే డబ్బులివ్వాల్సిందే..
ఓ వార్డులో పనిచేసే మహిళా కార్మికురాలు చనిపోతే.. ఆమె స్థానంలో భర్తను తీసుకునేందుకు మొదట ఓ అధికారి రూ. 50 లంచం తీసుకున్నారు. 6 నెలలు పని చేయించుకుని తొలగించి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. గతంలో రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు తీసుకుని 16 మందిని పారిశుద్ధ్య కార్మికులుగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి.
హోటళ్ల నుంచి నెలవారీ మామూళ్లు..
హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాల నుంచి చెత్తను ఉచితంగానే సేకరించాల్సి ఉంటుంది. అయితే చెత్త సేకరణ సిబ్బంది ప్రతినెల వాటి యజమానులనుంచి చెత్త సేకరణ కోసం నెలకు రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం.
బల్దియాలో 22 చెత్త సేకరణ ఆటోలు, 9 డంపింగ్ ట్రాక్టర్‌లు, స్కై లిఫ్ట్, పొక్లెయిన్, డోజర్, జీప్ ఉన్నాయి. చెత్త సేకరణ డంపింగ్ వాహనాల విషయంలో భారీగా గోల్‌మాల్ జరుగుతోంది. ప్రతి నెల రూ. 14 లక్షలకుపైగా బిల్లులు చెల్లిస్తుండగా.. వీటిలో రూ. 3 లక్షల నుంచి 5 లక్షలు అధికారులు, సిబ్బంది నొక్కేస్తున్నట్లు ఏసీబీ తనిఖీలలో తేలింది. రోజూ వాహనాలు తిరిగే కిలోమీటర్లను అధికంగా చూపిస్తూ డీజిల్ బిల్లులను అమాంతం పెంచేస్తున్నారని తెలుస్తోంది. వాహనాల మైలేజీకి, ఖర్చవుతున్న ఇంధనానికి పొంతన ఉండడం లేదు. రికార్డులను మాయం చేస్తూ కాకి లెక్కలు రాసినట్లు స్పష్టమవుతోంది. అలాగే రెండేళ్ల క్రితం ఈ విభాగంలో వాహనాల మరమ్మతులు, ఇందనం బిల్లుల రూపేణా రూ. కోటికిపైగా మింగేసినట్లు తెలిసింది.
సానిటేషన్ విభాగం సేకరించిన చెత్తలో వచ్చే ప్లాస్టిక్, ఇనుము, ఇతర సామగ్రిని రీసైక్లింగ్ కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. అయితే అధికారులు, సిబ్బంది వాటిని రహస్యంగా అమ్ముకుంటున్నారని తెలిసింది. సానిటేషన్ విభాగంలో ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు అవినీతి ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి కామారెడ్డి సానిటేషన్ విభాగంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
అవినీతికి కేరాఫ్‌గా కామారెడ్డి బల్దియా
సానిటేషన్ విభాగం
డుమ్మా కొట్టిన ఉద్యోగులకు హాజరు..
అనంతరం వారినుంచి వసూళ్లు
ఇంధన బిల్లుల్లోనూ ప్రతినెలా
రూ. 3లక్షలపైనే జేబుల్లోకి..
‘చెత్త’నూ వదలని అక్రమార్కులు
జిల్లా కేంద్రంలో గతేడాది 400 వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్‌లు రెన్యువల్ చేయలేదు. దీంతో ఖజానాకు కోటి రూపాయల వరకు గండి పడిందని ఏసీబీ సోదాలలో తేలింది. నిబంధనల ప్రకారం రావాల్సిన రుసుములను కాకుండా, తక్కువగా చూపిస్తూ ట్రేడ్ లైసెన్స్‌లు జారీ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. పాత పట్టణంలోని ఓ మర్చంట్ ఆసోసియేషన్‌కు చెందిన 25 దుకాణాల ట్రేడ్ లైసెన్స్‌లను రెన్యువల్ చేస్తే బల్దియాకు రూ. 8 లక్షలు వచ్చేవి. కానీ సిబ్బంది వారి నుంచి రూ. లక్షన్నర లంచం తీసుకుని నూతన ట్రెడ్ లైసెన్స్‌లను జారీ చేసినట్లు ఆరోపణలున్నాయి. డబ్బులు తీసుకుంటూ తప్పుడు కొలతలతో ట్రెడ్ లేసెన్స్‌లను జారీ చేస్తూ మున్సిపల్ ఖజానాకు భారీగా గండి కొడుతున్నారు.


