బాన్సువాడ : వర్ని మండలం చక్లి తండాకు చెందిన పట్లోత్ జబ్బార్ వద్ద 10 చిరుత పులి గోర్లు స్వాధీనం చేసుకుని, అతడిని రిమాండ్‌కు తరలించామని బాన్సువాడ ఎఫ్‌డీవో సునీత తెలిపారు. ఇటీవల బాన్సువాడ మండలం హన్మాజీపేట్ అటవీ ప్రాంతంలో చిరుత పులి కళేబరం కనిపించిన విషయం తెలిసిందే. చిరుతకు గోర్లు లేకపోవడాన్ని గమనించిన అటవీ అధికారులు ఆ దిశగా విచారణ జరిపారు. చక్లి తండాకు చెందిన పట్లోత్ జబ్బార్ అనే వ్యక్తి తీసుకెళ్లినట్లు విచారణలో తేలడంతో మంగళవారం అతడిపై కేసు నమోదు చేశారు. అతడి వద్దనుంచి చిరుత గోర్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని ఎఫ్‌డీవో తెలిపారు. ఈ ఘటనలో హన్మాజీపేట్ గ్రామానికి చెందిన హన్మంత్‌రావు, గుంటూరు తండాకు చెందిన వసంత్ అనే వ్యక్తులకు సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, విచారణ అనంతరం నిందితులను అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. చిరుత కళేబరం పూర్తిగా కుళ్లిపోయి ఉండడంతో ల్యాబ్‌కు పంపించామని, నివేదిక వచ్చాక ఎలా చనిపోయిందనే విషయం తెలుస్తుందని పేర్కొన్నారు. కాగా చిరుతపులి గోర్ల మాయం వెనుక అటవీశాఖ సిబ్బంది హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దోమకొండ: రైతులు ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్‌రెడ్డి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా ఎంపికై న సీతారాంపల్లి గ్రామానికి చెందిన 125 మంది రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి చెందిన రైతులకు ప్రకృతి వ్యవసాయం కిట్లు అందించామన్నారు. భూసార పరిరక్షణకు ప్రకృతి వ్యవసాయమే మేలన్నారు. కార్యక్రమంలో దోమకొండ, సీతారాంపల్లి సర్పంచ్‌లు నర్సయ్య, భానుశ్రీ, ఏవో మణిదీపిక, ఏఈవోలు కృష్ణారెడ్డి, సంజీవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గోపాల్‌రెడ్డి, నాయకులు తిర్మల్‌గౌడ్, అనంత్‌రెడ్డి, సీతారం మధు, సిద్దారెడ్డి, శ్రీనివాస్, రైతులు శంకర్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: వచ్చే నెలలో నిర్వహించే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్‌లాగ్ పరీక్షలకు సంబంధించి ఈనెల 20వ తేదీ వరకు పరీక్ష రుసుము చెల్లించాలని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ.100 అపరాద రుసుముతో 24 వరకు, రూ.500 అపరాద రుసుముతో 26వ తేదీ వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. పరీక్ష రుసుము చెల్లించిన విద్యార్థులు ఈనెల 26 వరకు తమ దరఖాస్తులను ఆయా కళాశాలల పరీక్షల విభాగంలో అందజేయాలని పరీక్షల అదనపు నియంత్రణ అధికారులు ఎన్.రాములు, ఏ.రాజేందర్ సూచించారు.
ఎల్లారెడ్డి: యువత ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తయారు చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ శశికళ సూచించారు. మంగళవారం ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జాతీయ స్థాయి సైన్స్ సెమినార్‌కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం కలుషితమై, దీని ప్రభావం అన్ని జీవరాశుల మీద పడుతుందని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ లక్ష్మీనారయణ, ఫలక్‌నుమా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ్‌కుమార్, ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ విజయభాస్కర్‌రెడ్డి, ఎల్లారెడ్డి కళాశాల సైన్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు శశిధర్, చంద్రకాంత్, గోదావరి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.


