కామారెడ్డి అర్బన్: వచ్చే విద్యా సంవత్సరానికిగాను బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకంలో నమో దు కోసం ఆసక్తిగల ప్రయివేట్ పాఠశాలలు ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొంది మంచి వసతులున్న, ఫలితాలు సాధిస్తున్న పాఠశాల యాజమాన్యాలు కలెక్టరేట్‌లోని 113వ నంబర్ గదిలోని తమ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
కామారెడ్డి అర్బన్: అడవుల్లో విత్తన బంతులు వేయడం మొక్కల పెంపకానికి ఎంతోగానో ఉపయోగపడుతుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. కళాశాల ఎకో క్లబ్, వృక్ష, అటవీశాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులు విత్తన బంతులు తయారు చేసి మంగళవారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సారవంతమైన మట్టితో తయారు చేసిన విత్తన బంతులతో అడవుల్లో వివిధ రకాల మొక్కలు పెంచే అవకాశం ఉంటుందన్నారు. వీటితో సకల జీవరాశికి ఆహారం అందడంతో పాటు ఆశ్రయం కలుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు దినకర్ చిన్న, విశ్వప్రసాద్, శ్రీవల్లి, స్వాతి, శ్రీలత, వెన్నెల, రమణ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : ఇంటర్ మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యునరేషన్ పెంచడంపై తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ జిల్లా అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గంగాధర్, విజయకుమార్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మణ్ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.


