● ఏబీవీపీ డిమాండ్
● కలెక్టరేట్ వద్ద ‘రాత్రి బస’
కామారెడ్డి టౌన్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 9 వేల కోట్ల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు చరణ్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో ఆదివారం కలెక్టరేట్ వద్ద రాత్రి బస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. వేల కోట్ల రూపాయల స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉండడం వల్ల పేద విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్‌లు విద్యార్థుల హక్కు అని, భిక్ష కాదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు అల్తాఫ్, స్వస్తిక్, రాకేష్, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ నాయకుల అరెస్ట్
‘రాత్రి బస’ కార్యక్రమంతో నిరసన తెలుపుతున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌ను తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం దారుణమని పరిషత్ నాయకులు పేర్కొన్నారు. ఈ క్రమంలో దేవునిపల్లి సీఐ రామన్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీసులు విద్యార్థులను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎస్సై భువనేశ్వర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


