గురుకులంలో దుర్ఘటన
● ఫర్నిచర్ తెచ్చిన ఆటోలోంచి పడి విద్యార్థిని దుర్మరణం
● వివరాలు తెలుసుకున్న
ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ రూరల్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం క్యాంపులోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి విషాదం చోటు చేసుకుంది. కొడిచిర గ్రామానికి చెందిన కౌవస్కర్ సంగీత అనే ఎనిమిదో తరగతి విద్యార్థిని ప్రమాదవశాత్తూ ఆటోలోంచి పడి మృతి చెందింది. స్థానికుల తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పీఎంశ్రీ కింద ఎంపికై న గురుకుల పాఠశాలలో ఐసీటీ ప్రోగ్రాం కోసం కిరాయికి ఫర్నిచర్ తెప్పించారు. ప్రిన్సిపల్ సునీత ఇంట్లో ఆదివారం ఫంక్షన్ ఉండడంతో వాటిని బాన్సువాడలోని ఆమె ఇంటికి తీసుకువెళ్లారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్యాసింజర్ ఆటోలో గురుకులానికి పంపించారు. కుర్చీలను విద్యార్థులు, సిబ్బంది కిందికి దించుతుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. చివరి కుర్చీ దించే క్రమంలో ఆటోడ్రైవర్ ఆటోను ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలో విద్యార్థిని సంగీత ఆటోలోంచి కిందపడి తీవ్రంగా గాయపడింది. తలకు తీవ్ర గాయమవడంతో అదే ఆటోలో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు అంజిరెడ్డి, జుబేర్, రాంచందర్ ఆస్పత్రికి చేరుకుని పాఠశాల ప్రిన్సిపల్ సునీత, ఉపాధ్యాయులు, సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆస్పత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థి మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. అస్పత్రి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాన్సువాడ సీఐ తుల శ్రీధర్ భారీభద్రత ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేశామని తెలిపారు.
గురుకులంలో దుర్ఘటన


