
దారి తప్పిన సర్దుబాట్లు!
నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల డిప్యుటేషన్లు
● అవసరం ఉన్న చోట కాదు.. అనుకూలంగా ఉన్న చోటికి..
● మారని విద్యాశాఖ అధికారుల తీరు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారంలో విద్యాశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రావ్యక్తమవుతున్నాయి. మొదటి నుంచి కామారెడ్డి జిల్లా విద్యాశాఖ కార్యాలయం వివాదాలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. డబ్బులు సర్దుబాటు చేస్తే ఎక్కడికంటే అక్కడికి సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరిగినట్టు తెలుస్తోంది. అవసరం ఉన్న బడికి సమీప పాఠశాలల నుంచి టీచర్లను సర్దుబాట్లు చేయాల్సి ఉండగా విద్యాశాఖ అధికారులు నిబంధనలను తుంగలోకి తొక్కి అడ్డగోలుగా డిప్యుటేషన్లు వేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అవసరం ఉన్న చోటకు సమీపంలోని ఉపా ధ్యాయులను సర్దుబాటు చేయాలని జీవో నంబర్ 25 స్పష్టంగా పేర్కొంటున్నప్పటికీ జిల్లాలో విచ్చలవిడిగా డిప్యుటేషన్లు వేస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన టీచర్ల సర్దుబాటు వ్యవహారంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
● నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేటలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఒకరిని రామారెడ్డి మండలానికి పంపించారు. నాలుగైదు మండలాలు దాటించారు. తరువాత అక్కడి నుంచి కామారెడ్డి పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలకు సర్దుబాటు చేశారు. సదరు ఉపాధ్యాయుడు పనిచేయాల్సిన బడిలో అవసరం లేకుంటే, అదే నాగిరెడ్డిపేట మండలంలో ఏదో ఒక బడికి పంపించాలి. లేనిపక్షంలో పక్కనే ఉన్న ఎల్లారెడ్డి మండలానికో, పొరుగున ఉన్న లింగంపేట మండలంలో అవసరం ఉన్న బడులకు సర్దుబాటు చేయాలి. కానీ నాలుగైదు మండలాలు దాటించి జిల్లా కేంద్రానికి తీసుకురావడంలో మతలబు ఏమిటో విద్యాశాఖ అధికారులకే తెలియాలి.
● కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి నుంచి ఓ ఉపాధ్యాయుడిని కామారెడ్డి పట్టణంలోని ఎస్సీవాడ ఉన్నత పాఠశాలకు, తరువాత అక్కడి నుంచి ఉగ్రవాయి బడికి పంపించారు. ఇదేం సర్దుబాటనేది ఎవరికీ అర్థం కాదు.
● లింగంపేట మండలం మోతె నుంచి రామారెడ్డికి, రామారెడ్డి నుంచి మోతెకు పరస్పరంగా సర్దుబాటు చేశారు.
● ఎల్లారెడ్డి మండలం నుంచి మరో ఉపాధ్యాయుడిని బాన్సువాడకు పంపించారు.
● భిక్కనూరు మండలం కాచాపూర్ నుంచి కామారెడ్డి పట్టణానికి ఇంకో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేశారు.
● మద్నూర్ మండలం నుంచి రామారెడ్డి మండలానికి మరో ఉపాధ్యాడిని సర్దుబాటు చేసినట్టు తెలుస్తోంది.
● ఎల్లారెడ్డి మండలం నుంచి రాజంపేట మండలానికి మరో ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేశారు.
గత విద్యాసంవత్సరంలో ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయుల డిప్యుటేషన్లు చేపట్టిన వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉపాధ్యాయుల డిప్యుటేషన్లను రద్దు చేసి, నిబంధనల ప్రకారం సర్దుబాటు చేశారు. అయినా ప్రస్తుతం అధికారులు అదే రకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల చేపట్టిన సర్దుబాట్లే దీనికి నిదర్శనమని పలువురు అంటున్నారు. అడ్డగోలుగా జరిగిన సర్దుబాట్లపై ఓ ఉపాధ్యాయ సంఘం నేత విద్యాశాఖ అధికారిని నిలదీయగా, రద్దు చేస్తానని పేర్కొన్నట్టు తెలుస్తోంది. టీచర్ల సర్దుబాటు వ్యవహారంపై విచారణ చేపడితే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది.
సబ్జెక్టు టీచర్లు లేని స్కూళ్లకు సమీపంలోని లేదా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న, లేదా అవసరానికి మించి ఎక్కువ మంది టీచర్లు ఉన్న స్కూల్ నుంచి సర్దుబాటు చేయాలి. ముఖ్యంగా కాంప్లెక్స్ పరిధిలో సర్దుబాటు చేయాలి. కాదూకూడదంటే మండలం పరిధిలో, అవసరం మేరకు పక్క మండల నుంచి సర్దుబాటు చేయాలి. కానీ జిల్లా విద్యాశాఖ అధికారులు కొందరు టీచర్లతో లాలూచీ పడి మూడు, నాలుగు మండలాలు దాటించి వారికి అనుకూలం ఉన్న బడికి పంపించారు. అలాగే పరస్పర డిప్యుటేషన్లు కూడా చేపట్టారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయుడు అవసరం ఉన్నప్పటికీ టీచర్ అవసరం కోసం డిప్యుటేషన్‌పై పంపించారు.