
రెవెన్యూ దరఖాస్తులను పరిష్కరించాలి
బీఎల్‌వోలకు గుర్తింపు కార్డులు..
● యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టండి
● రెవెన్యూ అధికారులకు
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాలు
కామారెడ్డి టౌన్: రెవెన్యూ పెండింగ్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో జిల్లా రెవెన్యూ అధికారులతో గురువారం సమీక్షాసమావేశం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న భూ భారతి, సీఎం, కలెక్టరేట్ ప్రజావాణిల పెండింగ్ దరఖాస్తులు, సర్టిఫికెట్ల జారీ, ఇసుక, మట్టి అక్రమరవాణా, ప్రభుత్వ భూముల సర్వే, రేషన్ కార్డుల పంపిణీ తదితర 16 అంశాలపై రివ్యూ నిర్వహించి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే సాదా బైనామాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కొత్తగా గ్రామపాలన అధికారులు కూడా వచ్చారని, మానవ వనరులకు ఇబ్బంది లేదన్నారు. అందుబాటులో ఉన్న శిక్షణ లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను ఉపయోగించుకోవాలని ఆదేశించారు. మండలాల్లో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, ఫారెస్ట్ భూముల వివాదాలను ఫారెస్ట్ అధికారులతో కలిసి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూముల సర్వే చేపట్టాలని, రేషన్ కార్డుల పంపిణీకి, ఇసుక, మొరం అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ విక్టర్ , డీఆర్‌వో మధుమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి, ఏడీ సర్వే ల్యాండ్, తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్‌లు, సర్వేయర్లు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలోని బీఎల్‌వోలకు ఐడీ కార్డుల పంపిణీ పూర్తి చేస్తామని, నూతన ఎపిక్ కార్డులను పోస్టాఫీసుల ద్వారా పంపిణీ చేస్తామని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్‌రెడ్డి గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులతో మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న ఫామ్ 6,7,8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలో 259 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అలాగే వందేళ్ల వయస్సు పైబడిన వారు 106 మంది ఉన్నారని, వారిలో చనిపోయిన వారి గుర్తింపు, మిగతా వారి వయస్సు ధ్రువీకరణను పరిశీలిస్తున్నామని వివరించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఆర్‌వో మధుమోహన్, ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.