
నిజామాబాద్‌కు ‘అగ్రి’ కళాశాల
● ఆమోదం తెలిపిన రాష్ట్ర కేబినెట్
● వ్యవసాయ రంగానికి మరింత ఊతం
● విద్య, పరిశోధనలతో పాటు
కొత్త వంగడాల సృష్టికి అవకాశం
డొంకేశ్వర్(ఆర్మూర్): వ్యవసాయాధారిత జిల్లాగా పిలువబడే నిజామాబాద్‌లో వ్యవసాయ కళాశాల ఏర్పాటు కానుంది. ఈ మేరకు గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రి కోర్సులు చేసే నిజామాబాద్ జిల్లాతోపాటు కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల్ విద్యార్థులకు వ్యవసాయ కళాశాల వరమనే చెప్పొచ్చు. తెలంగాణ యూనివర్సిటీలో ఇటీవల ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ కళాశాలను తేవడం నిజామాబాద్‌కు మరింత వన్నె తెస్తుంది. వ్యవసాయ కళాశాలను కూడా యూనివర్సిటీ పక్కనే ఏర్పాటు చేయనున్నారు.
ఉమ్మడి జిల్లాలో ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రా జెక్టులు పంటలకు పుష్కలంగా సాగునీటిని అందిస్తున్నాయి. దీంతో జిల్లాలో ఆరు లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగవుతున్నాయి. వరితోపాటు పసుపు, మొక్కజొన్న, సోయా, జొన్నలు, సజ్జలు కూడా ఎక్కువగా సాగవుతున్నాయి. జిల్లాలో పండించిన పంటలు ఇతర ప్రాంతాలు, దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో అత్యధిక పంటలు, రైతులు ఉన్న జిల్లాల్లో ఒకటిగా నిజామాబాద్ ఉంది. దీంతో వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు డిమాండ్ ఏర్పడింది. చెరుకు పరిశ్రమలు అలాగే రుద్రూర్ కృషి విజ్ఞా కేంద్రం, కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రాలకు తోడుగా వ్యవసాయ కళాశాల రావడంతో రైతుల్లో హర్షం వ్యకమవుతోంది.
ఎంచక్కా విద్య... స్థానికంగా పరిశోధన...
ఇందూరు కేంద్రంగా వ్యవసాయ కళాశాల ఏర్పాటైతే చుట్టు పక్కనున్న జిల్లాల విద్యార్థులు నిజామాబాద్‌లోనే వ్యవసాయ కోర్సులు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. వ్యవసాయ కోర్సులు చేయాలంటే హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్, జగిత్యాల ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అంతదూరం వెళ్లి చదువు, పరిశోధనలు చేయాలంటే విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఇప్పుడు నిజా మాబాద్ వ్యవసాయ కళాశాలలోనే పట్టభ ద్రులుగా, పరిశోధకులుగా, ప్రొఫెసర్లుగా తయారు కావొచ్చు. వ్యవసాయానికి అనువుగా ఉన్న నిజామాబాద్ జిల్లాలో పంటలపై ప్రయోగాలు సులువుగా చేయాడానికి వీలుంటుంది.