
చట్టాలపై అవగాహన ఉండాలి
దోమకొండ: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి నాగరాణి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం న్యాయసేవా సదస్సు నిర్వహించారు. జిల్లా లీగల్ సెల్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో భారత శిక్ష సంవిధాన, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్, పోక్సో, విద్యా హక్కు చట్టాల గురించి న్యాయమూర్తి వివరించారు. మైనర్ వివాహాల నిషేధ చట్టాలను తెలుసుకోవాలని సూచించారు. విద్యాహక్కు చట్టం 14 ఏళ్ల లోపు పిల్లలందరికీ చదువుకునే హక్కు కల్పించిందన్నారు. పిల్లలను పనికి పంపితే తల్లిదండ్రులు నేరస్తులవుతారని స్పష్టం చేశారు. మండల విద్యాశాఖ అధికారి విజయ్‌కుమార్, దోమకొండ ఎస్సై స్రవంతి, పారాలీగల్ సొసైటీ సభ్యులు, పాఠశాల హెడ్ మాస్టర్ శరత్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
బాన్సువాడ : పార్టీ కోసం కష్ట పడి పని చేసే వారికే పదవులు లభిస్తాయని ఏఐసీసీ జిల్లా పరిశీలకులు రాజ్‌పాల్ కరోలా అన్నారు. పట్టణంలోని శ్రీనివాస గార్డెన్‌లో గురువారం నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరోలా మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్ష పదవికి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, కష్టకాలంలో పార్టీ వెంట ఉండి కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందన్నారు. ఇప్పటికే చాలా మంది దరఖాస్తులు అందజేశారన్నారు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కై లాస్ శ్రీనివాస్‌కు తిరిగి డీసీసీ పదవి ఇవ్వాలని స్థానిక నాయకులు సూచించారు. కరోలాను ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గం కార్యకర్తలతో రాజ్‌పాల్ కరోలా సమావేశమయ్యారు.
కామారెడ్డి టౌన్: ఈ నెల 18న నిర్వహించ తలపెట్టిన తెలంగాణ బంద్‌కు వ్యాపార, వాణిజ్య, విద్య, రవాణా సంస్థలు, ప్రజలు సహకరించాలని బీసీ, అఖిలపక్ష నాయకులు కోరారు. బంద్‌లో పాల్గొనాలని కోరుతూ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆయా వ్యాపార సంఘాలకు గురువారం వినతిపత్రాలను అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాలు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు 42శాతం రిజర్వేషన్‌లు కల్పించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సాప శివరాములు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నీల నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుంబాల లక్ష్మణ్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు గణేశ్‌నాయక్, కొత్తపల్లి మల్లన్న, వెంకట్‌గౌడ్, ప్రవీణ్, యాదగిరి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

చట్టాలపై అవగాహన ఉండాలి