
పశువులకు గాలికుంటు నివారణ టీకాలు
దోమకొండ : పాడి, గొర్రెలు, మేకల పెంపకం ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల వారికి జీవనాధారం. జీవనోపాధినిస్తున్న మూగజీవాల్లో సంపూర్ణ ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు గాలికుంటు వ్యాధి నివారణ (ఏఫ్‌ఎండీ) అత్యంత కీలకం. పాడిపశువులకు గాలికుంటు వ్యాధి సోకితే పాడిరైతులు తీవ్రమైన నష్టాలను చావిచూడాల్సివస్తుంది. దేశవాలి పశువుల్లో కన్నా సంకర జాతి పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. పికార్నో అనే వైరస్ ద్వారా ఈ వ్యాధి పశువుల్లో త్వరగా వ్యాప్తి చెందుతుంది. గాలికుంటు వ్యాధిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రతి సంవత్సరం ఆరు నెలలకోసారి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈనెల 16 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో పశువైద్య బృందాలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నాయి. జిల్లాలో ఆవులు 68,370, గేదెలు 97,570 ఉన్నాయి. అదేవిధంగా గొర్రెలు 4,87,903, మేకలు 1,50,046 ఉన్నాయి. ఆవులు, ఎద్దులు, గొర్రెలు, మేకల్లో గాలికుంటు వ్యాధి తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.
నవంబర్ 14వరకు జిల్లాలో
ప్రత్యేక శిబిరాలు
జిల్లాలో ఆవులు 68,370,
గేదెలు 97,570..
గొర్రెలు 4,87,903,
మేకలు 1,50,046