
ఆర్మూర్‌లో మహిళ దారుణ హత్య
● వివాహేతర సంబంధమంటూ
ఘాతుకానికి పాల్పడిన భర్త
● నిందితుడి అరెస్టు
ఆర్మూర్‌టౌన్: వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భార్యను భర్త హత్య చేసిన ఘటన ఆర్మూర్‌లో వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన జగదీష్ 40 సంవత్సరాల క్రితం బతుకు దెరువు కోసం ఆర్మూర్‌కు వలస వచ్చాడు. కొన్నేళ్ల క్రితం మెదక్ జిల్లాకు చెందిన మమతను వివాహం చేసుకొని మామిడిపల్లి లో నివసిస్తున్నాడు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. జగదీష్ ఒక సామిల్‌లో పనిచేస్తుండగా, మమత నిజామాబాద్‌లో గణపతి విగ్రహాలకు మెరుగులు దిద్దే పనిచేస్తుంది. కాగ మమత మామిడిపల్లికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న విషయం తెలిసిన భర్త పలుమార్లు వారించాడు. ఈ విషయమై మంగళవారం వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. అనంతరం పనికి వెళ్లిన జగదీష్ ఇంటికి వచ్చేసరికి భార్య, ప్రియుడు కలిసి ఉండటాన్ని చూసి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. విచక్షణ కోల్పోయి, వంట గదిలో ఉన్న కత్తితో భార్య గొంతును కోసి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని జగదీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్‌హెచ్‌వో స్యతనారాయణగౌడ్, ఎస్సైలు రమేష్, వినయ్ సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.