
గోదావరిలో ఒకరి గల్లంతు
● బావమరిది మృతదేహం కోసం గాలిస్తుండగా బావ గల్లంతు
బాల్కొండ: మెండోరా మండలం చాకిర్యాల్ శివారులోని గోదావరి నదిలో ఆర్మూర్ మండలం చేపూర్‌కు చెందిన కనికరపు గంగన్న(45) శనివారం గల్లంతయ్యాడు. మెండోరా ఎస్సై సుహాసిని తెలిపిన వివరాల ప్రకారం.. చేపూర్‌కు చెందిన గంగన్న తన బావమరిది జొరిగె గంగాధర్ కొన్ని రోజుల క్రితం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకుంటానని ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఆయన స్కూటీ చాకిర్యాల్ గోదావరి సమీపంలో కనిపించింది. దీంతో ఇక్కడే పడి ఆత్మహత్య చేసుకుని ఉంటారని భావించిన గంగన్న శనివారం కొంత మంది బంధువులతో కలిసి వచ్చి గోదావరిలోకి గాలింపు చర్యలు చేపట్టారు. గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గంగన్న నీటిలో మునిగి కొట్టుకు పోయాడు. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒకరి అదృశ్యం
బోధన్‌రూరల్: మండలంలోని భూలక్ష్మి క్యాంప్ గ్రామానికి చెందిన లోకిరెడ్డి సాంబరెడ్డి అనే వ్యక్తి అదృశ్యమైనట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి శనివారం తెలిపారు. గ్రామంలో హోటల్ వ్యాపారం చేసుకుంటు జీవిస్తున్న సాంబరెడ్డి శుక్రవారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. చేసిన అప్పులు బాగా పెరిగిపోవడంతో మనోవేదనకు గురై ఇంటి నుంచి వెళ్లిపోయి ఉంటాడని కుటుంబీకులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.
రెంజల్‌లో వివాహిత..
రెంజల్: మండల కేంద్రానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు ఎస్సై చంద్రమోహన్ శనివారం తెలిపారు. గత నెల 16న ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.