గిట్లయిపాయె! | - | Sakshi
Sakshi News home page

గిట్లయిపాయె!

Oct 2 2025 8:05 AM | Updated on Oct 2 2025 8:05 AM

గిట్లయిపాయె!

గిట్లయిపాయె!

గిట్లయిపాయె!

కలిసిరాని రిజర్వేషన్లు

పలువురు నేతలకు తప్పని నిరాశ

రాజకీయాలపై వైరాగ్యం

జిల్లాలోని వివిధ మండలాల్లో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నుంచి ఎన్నికల బరిలో దిగాలని చాలామంది ఆరాటపడ్డారు. కామారెడ్డి మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్‌రెడ్డి జెడ్పీటీసీగా పోటీ చేయాలని భావించారు. అది కాకుంటే ఎంపీపీ పీఠం మీద కూర్చోవాలని కలలుగన్నారు. అయితే జెడ్పీటీసీ ఎస్సీ జనరల్‌, ఎంపీపీ ఎస్సీ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఆయన ఆశలు ఆవిరయ్యాయి. మాచారెడ్డి మాజీ ఎంపీపీ నర్సింగరావు మూడు పర్యాయాలు ఎంపీపీగా, ఒక పర్యా యం వైస్‌ ఎంపీపీగా, ఆయన భార్య అనిత ఒకసారి జెడ్పీటీసీగా పనిచేశారు. ఈసారి రిజర్వేషన్‌ కలిసొస్తే మరోసారి ఎంపీపీ లేదా జెడ్పీటీసీ చాన్స్‌ తగిలేది. అయితే ఎంపీపీ, జెడ్పీటీసీ రెండూ ఎస్టీ మహిళకు రిజర్వ్‌ కావడంతో ఆయన నిరాశ చెందారు. మాచారెడ్డి జెడ్పీటీసీగా పనిచేసిన మిన్కూరి రాంరెడ్డికి కూడా నిరాశే ఎదురయ్యింది. భిక్కనూరు నుంచి జెడ్పీటీసీగా ఎంపికై తే జెడ్పీ చైర్మన్‌ అవకాశం దక్కుతుందని ఆశించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డికి సైతం రిజర్వేషన్‌ కలిసిరాలేదు. ఈ మండలంలో పలువురు నేతలు జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులపై ఆశలు పెట్టుకోగా వారికి రిజర్వేషన్‌ అనుకూలించలేదు. జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీసీలకు దక్కడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలు పోటీకి రెడీ అవుతున్నారు. అధికార పార్టీ మాజీ ఎంపీపీ బల్యాల రేఖను బరిలో దింపే అవకాశం ఉంది.

బీబీపేట నుంచి మరోసారి పోటీ చేయాలనుకున్న బీఆర్‌ఎస్‌కు చెందిన జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ పరికి ప్రేమ్‌కుమార్‌కు రిజర్వేషన్‌ కలిసిరాలేదు. అయితే ఆయన భార్యకు అవకాశం దక్కవచ్చు. నాగిరెడ్డిపేట నుంచి బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ మనోహర్‌రెడ్డి ఈసారి కూడా జెడ్పీటీసీ లేదంటే ఎంపీపీ కావాలని ఆరాటపడ్డారు. అయితే రెండు పదవులు ఎస్సీలకు కేటాయించడంతో ఆయన ఆశలు గల్లంతయ్యాయి. ఎల్లారెడ్డి నుంచి జెడ్పీటీసీగా బరిలో దిగి, జెడ్పీ చైర్మన్‌ పదవి పొందాలని ఆరాటపడిన మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కుడుముల సత్యనారాయణదీ ఇదే పరిస్థితి. ఇక్కడ జెడ్పీటీసీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యింది.

లింగంపేట నుంచి జెడ్పీటీసీగా పోటీ చేయాలని పలువురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు ఆశపడ్డారు. కానీ జెడ్పీటీసీ, ఎంపీపీ పదవులు బీసీలకు దక్కడంతో వారికి అవకాశం చేజారింది. పాల్వంచ జెడ్పీటీసీ స్థానం బీసీలకు, ఎంపీపీ బీసీ మహిళకు కేటాయించారు. రాజంపేట మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ ఎస్టీలకు రిజర్వ్‌ అవడంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆరాటపడిన నల్లవెల్లి అశోక్‌, యాదవరెడ్డి, మోహన్‌రెడ్డి, కృష్ణారావు, ప్రణీత్‌రెడ్డి తదితరులకు నిరాశే ఎదురైంది. బాన్సువాడ జెడ్పీటీసీ బీసీలకు రిజర్వ్‌ కావడంతో అక్కడి నుంచి పోటీ చేయాలని ఆశించిన గోపాల్‌రెడ్డి ఆశలు గల్లంతయ్యాయి. నిజాంసాగర్‌, మహ్మద్‌నగర్‌ మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు బీసీ మహిళలకు కేటాయించడంతో అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులకు పోటీ చేసే అవకాశం మిస్సయ్యింది. రామారెడ్డిలో జెడ్పీటీసీగా మరోసారి పోటీ చేయాలని ఆరాటపడిన మోహన్‌రెడ్డికి రిజర్వేషన్‌ కలిసిరాలేదు. ఎంపీపీ, జెడ్పీటీసీ రెండు కూడా బీసీ మహిళకు రిజర్వ్‌ అవడంతో ఆయన పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గీరెడ్డి మహేందర్‌రెడ్డి ఎంపీపీ కావాలనుకున్నా రిజర్వేషన్‌ కలిసిరాలేదు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ఎంతోమంది ఆరాటపడ్డారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ పదవులలో రిజర్వేషన్‌ దేనికి అనుకూలిస్తే దానికి పోటీ చేయాలని భావించారు. కొందరైతే రెండుమూడేళ్లుగా జనంలో ఉంటున్నారు. అలాంటి పలువురు నేతల ఆశలను రిజర్వేషన్లు గల్లంతు చేశాయి. దీంతో వారు రాజకీయాలపై వైరాగ్యంతో ఉన్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement