
నేడు విజయదశమి
మద్యం, మాంసానికి చిక్కు..
● సొంతూళ్లకు చేరుకున్న జనం
● జిల్లావ్యాప్తంగా వేడుకలకు ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : చెడుపై మంచి విజయం సాధించిన రోజే విజయదశమి. సకల శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు ఇది. రావణాసురుడిపై రాముడు విజయం సాధించిన సుదినం.. ఈ విజయాలకు ప్రతీకగా దేశమంతా జరుపుకునే పండుగే దసరా. గురువారం విజయదశమి. పండుగ నేపథ్యంలో అంతటా సందడి నెలకొంది. బతుకుదెరువు కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలు, దూర ప్రాంతాలకు వెళ్లిన వారంతా దసరా సెలవుల్లో ఊళ్లకు చేరుకున్నారు. బతుకమ్మ పండగ కోసం ముందుగానే చాలామంది వచ్చారు. దీంతో ఏ ఇంటికి వెళ్లినా సందడి కనిపిస్తోంది. దసరా పండుగ నాడు కొత్త దుస్తులు ధరించి పాలపిట్టను చూడడానికి పచ్చని పొలాల వెంట వెళ్లడం ఆనవాయితీ. పాలపిట్టను దర్శించుకున్న తర్వాత జమ్మి వృక్షానికి పూజలు చేస్తారు. ఆలయాలకు వెళ్లి విజయాలను ఇవ్వాలని భగవంతుడిని వేడుకుంటారు. అనంతరం స్నేహితులు, బంధుమిత్రులకు జమ్మి ఆకు పంచుతూ అలయ్ బలయ్ తీసుకుంటారు. పండగ సందర్భంగా ఆయుధ, వాహన పూజలు నిర్వహిస్తారు.
దసరా పండగ రోజున ఇంటింటా మాంసాహార భోజనాలు, మద్యం సేవించడం ఆనవాయితీగా నడుస్తోంది. అయితే ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా పండగ రావడంతో మాంసం, మద్యం అమ్మకాలకు బ్రేక్ పడింది. దీంతో చాలా మంది ముందు రోజే అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు.