
ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దు
● ప్రశాంతంగా ఎన్నికలు
జరిగేలా చూడాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి క్రైం: ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాల సభ్యులకు బుధవారం కలెక్టరేట్‌లో శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలు బాధ్యత ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలపై ఉందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా జోనల్ అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి..
సర్పంచ్, వార్డు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డివిజన్, మండల అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. గుర్తించిన కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించడానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలన్నారు. అభ్యర్థులకోసం ఫారాలు, నామినేషన్ పత్రాలు, ఓటరు లిస్టులను సిద్ధం చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. సంబంధిత రూట్ మ్యాప్‌లను రూపొందించి పంపాలన్నారు. బ్యాలెట్ బాక్స్‌లను జిల్లా కేంద్రం నుంచి స్వీకరించడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. సర్పంచ్ అభ్యర్థులు తహసీల్దార్ వద్ద, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోటీదారులు సంబంధిత ఆర్డీవో వద్దనుంచి అవసరమైన అన్ని రకాల అనుమతులు పొందాల్సి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, లౌడ్ స్పీకర్ల వినియోగానికి అనుమతులను సంబంధిత పోలీసు అధికారుల నుంచి తీసుకుని తహసీల్దార్‌లకు సమర్పించాలని సూచించారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఏవైనా సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే (గ్రీవెన్స్ సెల్) 99087 12421 నంబర్‌ను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో బాన్సువాడ సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అదనపు కలెక్టర్‌లు విక్టర్, చందర్ నాయక్, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీపీవో మురళి, డీఈవో రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.