శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు | - | Sakshi
Sakshi News home page

శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు

Oct 2 2025 8:05 AM | Updated on Oct 2 2025 8:05 AM

శతాబ్

శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు

వందేళ్ల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) గురువారం 101వ వసంతంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక, సాంస్కృతిక సంస్థగా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ను 1925లో విజయదశమి రోజున నాగ్‌పూర్‌లో ఐదుగురు పిల్లలతో కేశవ బలిరామ్‌ హెడ్గేవార్‌ స్థాపించారు. తరువాత కొన్నేళ్లకు ఇందూరు నగరంలోని గాజుల్‌పేట దత్తమందిర్‌లో ‘ఇందూరు శాఖ’ను ప్రారంభించారు.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: ఇందూరు నగరంలో 65 చోట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు నడుస్తున్నాయి. ప్రతి బస్తీలో శాఖలు ఉండడంతో తెలంగాణలోనే సంపూర్ణ శాఖలున్న మొదటి నగరంగా నిలిచింది. జిల్లాలోని ఇతర మండలాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తు న శాఖలు విస్తరించాయి.

● శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ‘పంచ పరివర్తన్‌’ పేరిట (కుటుంబ ప్రబోధన, సామాజిక సమరసత, స్వ అధారిత జీవనం, బాధ్యతాయుత పౌరవిధు లు, పర్యావరణ పరిరక్షణ) అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. మరో నెలపాటు ఈ కార్యక్రమాలు జరుగనున్నాయి.

● హెడ్గేవార్‌ తాతగారైన నరహరి శాస్త్రి 169 సంవత్సరాల క్రితం రెంజల్‌ మండలం కందకుర్తి నుంచి వేదపండితులకు ప్రాధాన్యత ఇచ్చే భోంస్లే సంస్థానమైన నాగ్‌పూర్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలో కందకుర్తిలో స్మృతిమందిరంగా ఉన్న వారి ఇంటి వద్ద ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో 1989 నుంచి శ్రీ కేశవ శిశు విద్యామందిర్‌ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భరతమాత విగ్రహం, హెడ్గేవార్‌ కులదైవమైన చెన్నకేశవనాథ్‌ విగ్రహం, హెడ్గేవార్‌ విగ్రహం ప్రతిష్ఠించారు. కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో గో దావరి హారతి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు.

కాగా శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హెడ్గేవార్‌ పూర్వీకుల ఇంటి స్థానంలో రూ.12 కోట్ల వ్యయంతో భారీ స్మృతి మందిరం నిర్మిస్తున్నారు. దీని వద్దనే గోదావరి ఒడ్డున మరో 10 ఎకరాల్లో కేశవ స్ఫూర్తి కేంద్రం, పాఠశాల, వసతిగృహం, భరతమాత ఆలయం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నారు. పేద పిల్లలు, రైతులు, మహిళలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టేందుకు నిర్ణయించారు. పాఠశాలలో ముస్లిం విద్యార్థులు సైతం విద్యనభ్యసిస్తున్నారు.

కేశవ సేవాసమితి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్న కందకుర్తి గ్రామాన్ని ఇప్పటికే పలువురు సర్‌సంఘ్‌ చాలక్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌)లు సందర్శించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న స్మృతి మందిరం ప్రారంభానికి ఆర్‌ఎస్‌ఎస్‌ సర్‌సంఘ్‌ చాలక్‌ మోహన్‌ భగవత్‌జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో హాజరు కానున్నారు.

● కేశవ్‌ బలిరాం పంత్‌ హెడ్గేవార్‌ నాగ్‌పూర్‌లోనే జన్మించారు. కోల్‌కతాలో వైద్య విద్యనభ్యసించారు. బెంగాల్‌లో అనుశీలన సమితి, జుగాంతర్‌ మొదలైనవాటి ప్రభావానికి లోనయ్యారు. కాంగ్రెస్‌, హిందూ మహాసభలలో సభ్యుడిగా పనిచేశారు. దేశ స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నందుకు రెండుసార్లు జైలు శిక్ష అనుభవించారు. హెడ్గేవార్‌ వైద్య విద్య అభ్యసించినా.. సమాజంలో ఉన్న రుగ్మతలపై ఎక్కువగా దృష్టి సారించారు. దేశం విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోవడానికి హిందువులు కులాలవారీగా విడిపోయి కలహించుకోవడం, ఆత్మన్యూనతలో మునిగిపోవడం కారణాలుగా భావించిన ఆయన.. సమాజంలో ఐక్యత కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుని ఆర్‌ఎస్‌ఎస్‌ను స్థాపించారు. ఆయన నాటిన విత్తనం మొలకెత్తి అంచెలంచెలుగా ఎదిగి నేడు వటవృక్షమైంది.హెడ్గేవార్‌ 1940 జూన్‌ 21న మరణించారు.

ఇందూరు జిల్లాలో ఉరకలెత్తుతున్న

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌

కందకుర్తిలో సంఘ్‌ వ్యవస్థాపకులు

హెడ్గేవార్‌ మూలాలు

హెడ్గేవార్‌ పూర్వీకుల ఇంటి స్థానంలో కొనసాగుతున్న స్మృతి మందిర నిర్మాణం

సంఘ్‌ ఆధ్వర్యంలో ‘పంచ పరివర్తన్‌’ సూత్రాలతో శతాబ్ది ఉత్సవాలు

నేడు 101వ వసంతంలోకి

అడుగు పెట్టనున్న ఆర్‌ఎస్‌ఎస్‌

శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు 1
1/1

శతాబ్ది ప్రస్థానంలో కాషాయం రెపరెపలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement