
వణికిస్తున్న సీజనల్ వ్యాధులు
దోమ తెరలు వాడాలి
రాజంపేట: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల ప్రభావం భారీగా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాల్లో జ్వర బాధితుల సంఖ్య పెరిగింది. అపరిశుభ్రంగా ఉంటే జ్వరంతోపాటు డెంగీ, మలేరియా వంటి వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉందని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా జనాల్లో అవగాహన కల్పించడంతోపాటు గ్రామ పంచాయతీ సిబ్బంది దోమలను నియంత్రించేందుకు చర్యలు చేపడుతున్నారు. జిల్లా అధికారులు ఆదేశాల మేరకు గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం లేకపోలేదని వైద్య సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం..
దోమల కారణంగా మలేరియా, డెంగీ వ్యాధులు పెరుగుతుంటాయి. వీటి బారిన పడకుండా దోమల నియంత్రణకు పరిసరాల పరిశుభ్రత పాటించడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇంట్లో దుమ్ము ధూళి, పాత సామగ్రిని శుభ్రం చేయాలి. ఇంటి చుట్టూ పూల కుండీలు, కూలర్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎక్కడపడితే అక్కడి నీరు తాగడం మంచిది కాదు. బయట ఆహారానికి దూరంగా ఉండడమే మేలు. కాచి చల్లార్చి వడ బోసిన నీటిని తాగడం మంచిది. మూడు రోజుల కంటే జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, ఇతర సమస్యలు వేధిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
వర్షాల కారణంగా నీటి నిల్వలతో వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. కానీ ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి. ఇళ్లలో దోమ తెరలు వాడాలి.
– విజయ మహాలక్ష్మి, వైద్యులు, రాజంపేట
రోజురోజుకూ పెరుగుతున్న
జ్వరపీడితులు
గ్రామాలలో కొనసాగుతున్న
వైద్య శిబిరాలు
భయపెడుతున్న డెంగీ, మలేరియా
పరిసరాల శుభ్రతపై అవగాహన
కల్పిస్తున్న అధికారులు

వణికిస్తున్న సీజనల్ వ్యాధులు