
‘మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి’
దోమకొండ: స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌లో భాగంగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు చేస్తున్నట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తెలిపారు. మహిళలు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా స్వస్థ్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. దోమకొండ వైద్య శిబిరంలో 124 మంది మహిళలకు ప్రత్యేక వైద్య సేవలను అందించామన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మి, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రభుకిరణ్, ప్రోగ్రాం అధికారులు శిరీష, రాధిక, అనురాధ, దోమకొండ ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: భారత దేశాన్ని విశ్వగురువుగా నిలపడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని ఎమెల్యే వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ప్రధాని జన్మదిన వేడుకలను బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 ఏళ్లుగా దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్న వ్యక్తి మోదీ అన్నారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదానం చేయడం సంతృప్తిని ఇచ్చిందన్నారు. రక్తదానం చేసిన వారికి ఎమ్మెల్యే హెల్మెట్‌లను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

‘మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి’