
అధికారం ఎక్కడుంటే అక్కడుంటారంటూ..
పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నపుడు అక్కడ వెలుగు వెలిగి, తమపై దౌర్జన్యాలు చేసిన వారంతా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కండువాలు మార్చి ఇక్కడా వారే పెత్తనం చేస్తున్నారని పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఎక్కడుంటే అక్కడికి చేరేవారిని చేరదీయడం ద్వారా తమకు అన్యాయం చేస్తున్నారన్న అభిప్రాయంతో చాలామంది నేతలున్నారు. అధికారంలో లేనప్పుడు జెండాలు మోసిన వారిని పార్టీ పట్టించుకోవడం లేదని, అధికారం చేపట్టిన తరువాత వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ ఆవేదన చెందుతోంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలే వారినే ప్రోత్సహిస్తున్నారంటూ జిల్లాలోని ఆయా నియోజక వర్గాలకు చెందిన కాంగ్రెస్ నేతలు సామాజిక మాధ్యమాల వేదికగా తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. చాలా మంది తమ వాట్సాప్ స్టేటస్‌లుగా పెట్టుకుంటున్న కొటేషన్లను చూస్తుంటే వారు ఎంత ఆవేదనతో ఉన్నారో స్పష్టమవుతోంది. అన్ని ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఉందని నేతలు బాహటంగా మాట్లాడుకుంటున్నారు.