
మరమ్మతులకు నిధులు మంజూరు
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
● 8 పనులకు రూ. 46 లక్షలు..
● యుద్ధ ప్రాతిపదికన పనుల
ప్రారంభానికి చర్యలు
నిజాంసాగర్ : జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షా లతో దెబ్బతిన్న ప్రాజెక్టులు, చెరువులకు తాత్కాలిక మరమ్మతులకోసం నిధులు మంజూరయ్యాయి. పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టనున్నారు.
కల్యాణి ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో గత నెల 27న మట్టి కట్టలు తెగిపోయిన విషయం తెలిసిందే. ఎగువ నుంచి వరద నీరు ఉధృతంగా రావడంతో ప్రాజెక్టు మట్టికట్టలు తెగడంతో బొగ్గుగుడిసె చౌరస్తా నీటమునిగింది. మట్టి కట్టలకు తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ. 20 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో కల్యాణి ప్రాజెక్టుకు రెండువైపులా కొట్టుకుపోయిన మట్టి కట్టల వద్ద ఇసుక బస్తాలు, మట్టి, మొరం వేసి తాత్కాలికంగా గండ్లు పూడ్చనున్నారు.
చెరువు కట్టలకు..
మహమ్మద్‌నగర్ మండలంలోని నర్వ పాతచెరువు పంట కాలువ కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతుల కోసం రూ. 5.9 లక్షలు మంజూరయ్యాయి. సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్ తాత్కాలిక మరమ్మతులకు రూ. 9.5 లక్షలు మంజూరు చేశారు. గాలిపూర్ చెరువు మరమ్మతులకు రూ. 2 లక్షలు, మద్నూర్ మండలం హండేకల్లూర్ చెరువుకు లక్ష రూపాయల చొప్పున ఫ్లడ్ డ్యామేజ్ కింద నిధులు మంజూరయ్యాయి.
చిన్నపూల్ వంతెన రెయిలింగ్‌కు..
ఇటీవల నిజాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా 2.5 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో నిజాంసాగర్‌లోని చిన్నపూల్ వంతెన రెయిలింగ్ కొట్టుకుపోయింది. దీనికి మరమ్మతుల కోసం రూ. 6.75 లక్షలు మంజూరయ్యాయి.
వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మట్టి కట్టలకు తాత్కాలిక మరమ్మతుల కోసం ఎమర్జెన్సీ కింద రూ. 46 లక్షలు మంజూరయ్యాయి. కల్యాణి ప్రాజెక్టు మట్టికట్టలతో పాటు సింగితం రిజర్వాయర్ రిటెయినింగ్ వాల్, పలు చెరువులకు మరమ్మతుల కోసం నిధులు వచ్చాయి. ఒకటిరెండు రోజుల్లో టెండర్లు పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతాం. – సోలోమన్,
నీటిపారుదల శాఖ ఈఈ, నిజాంసాగర్

మరమ్మతులకు నిధులు మంజూరు