
బీర్కూర్ ‘సహకారం’ ఎవరికో?
● పోచారం, ఏనుగు వర్గీయుల
మధ్య పోటీ
● నేడో రేపో స్పష్టత వచ్చే అవకాశం
బాన్సువాడ : బీర్కూర్ సహకార సంఘం అధ్యక్ష పదవి కోసం వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గాల మధ్య పోటీ నెలకొంది. అధ్యక్ష పదవి కోసం ఇరు వర్గాల డైరెక్టర్లు పట్టుబడుతు న్నట్లు తెలుస్తోంది. గతంలో సహకార సంఘం అధ్యక్షుడిగా ఉన్న గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని ఆరు నెలల క్రితం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. దీంతో ఉపాధ్యక్షుడిగా ఉన్న కిష్టాపూర్ గ్రామానికి చెందిన రాధాకృష్ణకు అధికారులు ఇన్‌చార్జి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. కాగా ఆయన సహకార సంఘంలో బకాయి పెట్టి ఎరువులను తీసుకున్నారు. ఎరువుల బకాయిలు రూ.1.20 లక్షలు చెల్లించాలని జిల్లా సహకార అధికారులు రాధాకృష్ణకు నోటీసులు ఇచ్చారు. అయితే రాధాకృష్ణ ఎంతకీ బకాయి మొత్తాన్ని చెల్లించకపోవడంతో ఇన్‌చార్జి పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఇటీవల అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అధ్యక్ష పదవికి మరో డైరెక్టర్‌ను నియమించాల్సి ఉంది. పోచారం వర్గానికి చెందిన డైరెక్టర్ ఇంగు రాములు, ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గానికి చెందిన పోగు పాండు అధ్యక్ష పదవి కోసం పట్టుపడుతున్నారు. ఇరువురు కూడా స్థానిక నాయకులతో కలిసి రెండు రోజులుగా హైదరాబాద్‌లోనే మకాం వేశారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన ఇంగు రాములు తన నాయకులతో కలిసి సీఎంతో పాటు మంత్రులను కలిసినట్లు తెలిసింది. ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గానికి చెందిన పోగు పాండు.. ఎంపీ సురేశ్ షెట్కార్‌తో కలిసి పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ప్రస్తుతం డివిజన్‌లో అందరి దృష్టి బీర్కూర్ సహకార సంఘంపై ఉంది. నేడో రేపో అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.