
‘వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత పెరుగుతుంది’
కామారెడ్డి అర్బన్: విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఉపయోగపడుతాయని డీఈవో రాజు పే ర్కొన్నారు. కామారెడ్డిలోని శ్రీసరస్వతి విద్యామందిర్ హైస్కూల్‌లో ప్రారంభమైన మూడు రోజుల రాష్ట్ర స్థాయి గణిత విజ్ఞాన, సాంస్కృతిక మహోత్సవం కొనసాగుతోంది. శనివారం రెండోరోజు కార్యక్రమంలో డీఈ వో మాట్లాడుతూ విద్యార్థుల బహుముఖ వికాసానికి ఉపయోగపడే విధంగా సాంస్కృతిక, గణిత విజ్ఞాన ప్రదర్శన నిర్వహించడం బాగుందన్నారు. పట్టణంలోని వాగ్దేవి, ఎస్‌పీఆర్, ఆర్చిడ్స్, లిటిల్ స్కాలర్స్ హైసూళ్లతో పాటు ఆయా పాఠశాలల విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శనను సందర్శించి వివిధ అంశాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠం ప్రాంత శైక్షణిక్ ప్రముఖ్ నల్లాన్‌చక్రవర్తుల కృష్ణమాచార్యులు, స్థానిక సరస్వతి విద్యామందిర్ ప్రతినిధులు గంగారెడ్డి, హరిస్మరణ్‌రెడ్డి, గీరెడ్డి రాజారెడ్డి, రంజిత్‌మోహన్, భాస్కర్‌రావు, గోవర్ధన్‌రెడ్డి, ప్రిన్సిపల్ నాగభూషణం, అకడమిక్ ప్రిన్సిపల్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.
‘మరమ్మతులు చేపట్టాలి’
కామారెడ్డి క్రైం : భారీ వర్షాలు, వరదలకు దెబ్బతిన్న మౌలిక వసతులకు సంబంధించిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన.. దెబ్బతిన్న రోడ్లు, ఇతర వసతులను పరిశీలించారు. హౌసింగ్ బోర్డు ప్రాంతంలోని వైకుంఠధామం వద్ద జరుగుతున్న రోడ్డు మరమ్మతులు, నీటి సరఫరా జరిగే ఫిల్టర్ బెడ్‌లను సందర్శించారు. పునరుద్ధరణ పనులను వేగంగా చేపట్టాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారాలకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో వీణ, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి, మున్సిపల్ ఏఈ శంకర్, అధికారులు వేణుప్రసాద్, డీటీ రవికుమార్, ఆర్‌ఐ నర్సింహారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
‘సమయ పాలన పాటించాలి’
ఎల్లారెడ్డిరూరల్: అంగన్‌వాడీ కేంద్రాలలో సమయపాలన పాటించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల సూచించారు. శనివారం అన్నాసాగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. కేంద్రంలోని రికార్డులను పరిశీలించారు. చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యాబోధన చేయాలని సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా అంగన్‌వాడి కేంద్రానికి సంబంధించిన భవనం పైకప్పునుంచి నీరు కారినందున వేరే భవనంలోకి మార్చేలా చూడాలని గ్రామస్తులు జిల్లా అధికారిని కోరారు. కార్యక్రమంలో ఏసీడీపీవో ప్రసన్న, అంగన్‌వాడీ టీచర్ దుర్గ తదితరులు పాల్గొన్నారు.
‘సిమీ, పీఎఫ్‌ఐ, ఐసీఎస్‌కు
నిజామాబాద్ అడ్డా’
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): సిమీ, పీఎఫ్‌ఐ, ఐసీఎస్ వంటి సంస్థలకు నిజామాబాద్ అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో శనివారం సీపీ పోతరాజు సాయిచైతన్యతో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా లో పోస్టు చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఈ సందర్భంగా ఓ వర్గానికి చెందిన సుమారు 400 మంది బైక్ ర్యాలీ నిర్వహించి, హారన్ కొడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం పోలీసులు కేసు పెట్టలేదన్నారు. తాను పోలీసులతో మాట్లాడిన తర్వాత ర్యాలీకి బాధ్యత వహించిన వారిపై కేసులు నమోదు చేశారన్నారు. తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన ఎందుకు తీసుకు వస్తున్నారని ప్రశ్నించారు. హిందువుల పండుగలకు ఆంక్షలు ఎక్కువయ్యాయన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఉగ్ర కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సీపీని కోరినట్లు తెలిపారు.

‘వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత పెరుగుతుంది’

‘వైజ్ఞానిక ప్రదర్శనలతో సృజనాత్మకత పెరుగుతుంది’