
మరోసారి ఉపఎన్నిక!
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మరోసారి ఉప ఎన్నిక అనివార్యం కానుంది! బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ తరువాత ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేస్తున్నట్లు కవిత ప్రకటించడంతో ‘ఉప ఎన్నిక’ చర్చ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్సీ స్థానానికి 2020లో ఒకసారి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బీఆర్‌ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ వ్యవహారం మరో ఉప ఎన్నికకు దారితీసింది. పార్టీ నుంచి వేటుపడిన వెంటనే ఆమె తన శాసన మండలి సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉప ఎన్నికపై జోరుగా చర్చ సాగుతోంది. 2019లో ఎంపీగా ఓటమిపాలైన కవిత.. 2020లో జరిగిన ఉప ఎన్నికలో స్థానికసంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడడంతో ఉప ఎన్నిక రాగా, కవిత బరిలో నిలిచి గెలిచారు. ఆ స్థానం కాలపరిమితి ముగియడంతో 2022 జనవరిలో నిర్వహించిన ఎన్నికల్లో కవిత మరోసారి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2028 వరకు కాలపరిమితి ఉన్నప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ ఆమె రాజీనామాను ఆమోదిస్తే ఉప ఎన్నిక నిర్వహించాల్సిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ‘స్థానిక’ ఎన్నికల వాతావరణం ఉండగా.. అదే కోటాలో నిర్వహించాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఆలస్యం అవడం ఖాయం. ఉప ఎన్నిక నిర్వహించాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కావాల్సి ఉంటుంది.
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు..
ఉప ఎన్నికలకు ఆస్కారమిచ్చారు..
2016 జనవరిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా డాక్టర్ భూపతిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే భూపతిరెడ్డి కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో 2020లో అనర్హత వేటుకు గురయ్యారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ సమయంలో నిర్వహించిన ఉప ఎన్నికల్లో గెలుపొందిన కవిత, తరువాత జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ వేటుకు గురైన కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ ఆమోదిస్తే, స్థానిక ఎన్నికలు పూర్తయ్యాక ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటోంది.
రాజీనామా చేసిన ఎమ్మెల్సీ కవిత
మండలి చైర్మన్ ఆమోదిస్తే
ఉప ఎన్నిక పెట్టాల్సిందే
2020 ఉప ఎన్నికలు,
2022 ఎన్నికల్లో కవిత విజయం
స్థానిక సంస్థల ఎన్నికల తరువాతే
ఉప ఎన్నికకు అవకాశం
తాజా పరిస్థితులపై జోరుగా చర్చలు