
మీకేం కాదని..
మేమున్నామని..
భారీ వర్షాలు, వరదలతో ఊహించని విపత్తును ఎదుర్కొన్న జిల్లావాసులు అష్టకష్టాలు పడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గడిపారు. పోలీసు, రెస్క్యూ
బృందాలు చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. ప్రాణాలను లెక్కచేయకుండా శ్రమించి, బాధితులను రక్షించిన వారి సేవలపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
– కామారెడ్డి క్రైం
జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురియడంతోపాటు ఊహించని విధంగా వరదలు వచ్చాయి. దీంతో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. వరదలు జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం భారీ వరదలకు కకావికలమైంది. ఇలాంటి విపత్తు సమయంలో జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు అండగా నిలిచింది. వరదల్లో చాలామంది పోలీసులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధుల్లో పాల్గొని ప్రజలను కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర సైతం వరదలు మొదలైన దగ్గర నుంచి స్వయంగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేస్తూ, సహాయక చర్యల్లో తలమునకలయ్యారు. విపత్తులో చిక్కుకున్న వందల మందిని సురక్షితంగా బయటకు చేర్చడంలో కృతకృత్యులయ్యారు.
వరదల్లో ప్రజలకు అండగా
నిలిచిన పోలీసు యంత్రాంగం
జిల్లాలో 775 మందిని
రక్షించిన రెస్క్యూ బృందాలు
సేవలను ప్రశంసిస్తున్న జిల్లావాసులు

మీకేం కాదని..