
కొట్టుకొచ్చిన మృతదేహం
కామారెడ్డి క్రైం: కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలోని చెట్ల పొదల్లో ఓ వ్యక్తి మృతదేహంను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ప్యాంటు జేబులో ఉన్న ఆధార్ కార్డు, ఇతర ఆనవాళ్లతో మృతుడిని కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కరివేపాల బాలరాజు (50)గా గుర్తించారు. నెల క్రితం అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేడు. మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల్లో అతడు గల్లంతై చెరువు వరదలో కొట్టుకుపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు.