
ఎంత పని చేసింది పాడు వాన
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పండుగ పూట ఉరిమిన మేఘం సృష్టించిన విధ్వంసకాండను చూసిన కలాలు, గళాలు కంట తడిపెట్టాయి. కన్నీటి నుంచి రాలిన అక్షరాలనే కవితలు, పాటలుగా ప్రపంచం ముందుంచాయి. జిల్లా కేంద్రంలో వరదలు ఎందరి జీవితాలనో నాశనం చేసిన సంఘటనపై పలువురు కవులు, రచయితలు, గాయకులు తమ ఆవేదనను అక్షరరూపంలో వ్యక్త పరిచారు. ప్రకృతి సృష్టించిన బీభత్స కాండకు కారణాలపై కొందరు, ఆక్రమణలపై మరికొందరు కవితలు, పాటలు రాశారు. ఇవి జనాన్ని కదలిస్తూ వైరల్ అవుతున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని..
● కామారెడ్డికి చెందిన కవి, రచయిత వి.శంకర్ కామారెడ్డిలో వరదల విధ్వంసంపై తన మినీ కవితల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రకృతి ప్రశ్నలు సంధిస్తున్నది మనిషీ.. నువ్వు మనగలుగుతావా? మట్టి కొట్టుకుపోతావా? పాఠం ప్రశ్నార్థకమే?’, ‘ఓ పరమేశా! గంగను పిలు.. వరదలు చాలున్’ అంటూ కవితలల్లారు.
● కామారెడ్డికి చెందిన కవి, గాయకుడు గఫూర్ శిక్షక్ ఇది కామారెడ్డి వేదన.. ప్రజల ఇబ్బందుల రోదన.. నీళ్లు నిండిపోయి ఇంట్లో చేరిపోయి.. చెరువు నిండిపోయి రోడ్లు తెగిపోయే.. ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు..’ అంటూ పాట రూపంలో తన ఆవేదనను వ్యక్తం చేశారు.
● కామారెడ్డికి చెందిన కవి అల్లి మోహన్‌రాజ్ ‘ అబ్బబ్బ.. ఇదేం ఆన.. గిదేం ఆన.. ఊర్లని ముంచింది.. పంటలను ముంచింది.. యాడ సూసిన వరదలే’ అంటూ తన కవితలో వివరించారు. సెరువులు, కుంటలు, వాగులు, నదులు ఒక్కటేమిటి అన్నీ కబ్జా సేసి ఇండ్లు కట్టి డబ్బు సంపాయించవట్రి.. అడ్డుజెప్పినోళ్లను బెదిరించవట్రి.. అయిందేదో అయ్యింది గీడికెళ్లన్న తప్పుల్ని సరిదిద్దుకుందం, మనుషుల తీర్గ బతుకుదాం’ అంటారు.
● షెట్పల్లికి చెందిన బందరబోయిన శ్రీనివాస్ ‘ఊరంతా సెరువవ్వగ కామారెడ్డి తల్లడిల్లిపోయెనో’ అంటూ పాట రాశారు. పండగపూట బతుకులు ఆగమాయె. ఎప్పుడెరగని కష్టాల రోదనాయే అంటూ ప్రజల కష్టాలను తన పాటలో ఏకరువు పెట్టారు.
● కొండాపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు తిరుమల తిరుపతిరావు ‘వరుణుడి కోపము తాండవించె ప్రభంజనములా ప్రజ్వరిల్లె కామారెడ్డి నగరం తల్లడిల్లె కుంభవృష్టిని కురిపించె’ నంటూ పాట రాశాడు.
● తాడ్వాయికి చెందిన నర్సింలు ‘భూమి చుట్టూ జలసిరి భుజాలపై బాలల ఊపిరి, భూమి ఏదో బుడగ ఏదో లోతు ఎంతనో తెలియదు.. లొంతాలు ఏవో తెలియవు.. మానవత్వమే మహోన్నతమైన రక్షణ కవచమంటూ, సహాయం చేసుకుంటూ మానవత్వాన్ని రక్షించుకుందాం రండి అని తన కవిత ద్వారా పిలుపునిచ్చారు.
● కాశ నర్సయ్య అనే కవి ‘కుంభవృష్టి’ అనే పాటలో ఉన్నాడా దేవుడొకడు ఉంటే ఈ బాధలెట్ల ఊర్లల్లో అని ఆవేదన వ్యక్తం చేశారు.