
నేడు బిచ్కుందకు మంత్రి కోమటిరెడ్డి రాక
బిచ్కుంద: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోమవారం బిచ్కుందలో పర్యటించనున్నారు. జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. బిచ్కుంద మండలంలోని ఖద్‌గాం నుంచి డోంగ్లీ వరకు రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దీనికి సంబంధించి గోపన్‌పల్లి చౌరస్తా వద్ద శిలాఫలకం ఏర్పాటు చేశారు. మంత్రి పర్యటన రూట్‌ను ఆదివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఆమె తహసీల్దార్ వేణుగోపాల్, ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి పర్యటన ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
మంత్రి వస్తున్నారని..
బిచ్కుంద: మండల కేంద్రంలో సోమవారం ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ అధికారులు స్పందించి రోడ్డుపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. మండల కేంద్రంతోపాటు బాన్సువాడ మార్గంలో రోడ్డు దెబ్బతింది. చాలాచోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లూ పట్టించుకోని అధికారులు.. ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి వస్తుండడంతో మరమ్మతులు చేయించారు. అయితే తారు పోయకుండా కంకర వేసి చేతులు దులుపుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం కంకర పోసి వదిలేయడంతో ఆ దారిలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ట్రయథ్లాన్ పోటీల్లో
జిల్లాకు వెండి పతకం
కామారెడ్డి అర్బన్: హనుమకొండలోని జేఎన్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ట్రయథ్లాన్ పోటీల్లో జిల్లా క్రీడాకారిణి సత్తాచాటింది. అండర్–10 విభాగంలో బి.ధనశ్రీ స్టాండింగ్ బ్రాడ్ జంప్‌లో ద్వితీయ స్థానం పొంది వెండి పతకం సాధించింది. ఈ విషయాన్ని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అనిల్‌కుమార్ తెలిపారు.
‘దళితుడి ఇంటిని కూల్చేయడం సరికాదు’
ఎల్లారెడ్డి: సామాన్య దళితుడి ఇంటిని కూల్చివేయడం సరికాదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిన్నరాజులు, మాజీ ఎంపీ బీబీ పాటిల్ పేర్కొన్నారు. మల్కాపూర్‌లో ఇటీవల అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీజేపీ మండల అధ్యక్షుడు నర్సింలు ఇంటిని కూల్చివేసిన విషయం తెలిసిందే. ఆదివారం బీజేపీ నేతలు ఆ నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయ కక్షతోనే నిర్మాణాన్ని కూల్చివేయించారని ఆరోపించారు. అలాంటివారికి రానున్న రోజులలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. అనంతరం నర్సింలుకు బీబీ పాటిల్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, నేతలు బాణాల లక్ష్మారెడ్డి, నక్క గంగాధర్, బాలకిషన్, సతీష్, రాజేష్, దేవేందర్, రామలు తదితరులు పాల్గొన్నారు.
10న పుణ్యక్షేత్రాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
బాన్సువాడ : బాన్సువాడ నుంచి బీదర్ నర్సింహస్వామి ఆలయానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని కల్పించినట్లు డిపో మేనేజర్ సరితాదేవి తెలిపారు. ఈనెల 10న ఉదయం 6 గంటలకు బాన్సువాడ బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, జరాసంగంలోని మహాదేవుడి ఆలయంతోపాటు బీదర్ నర్సింహస్వామి ఆలయాల వద్ద ఆగుతుందని పేర్కొన్నారు. తిరిగి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్ ధర పెద్దలకు రూ. 1,300, పిల్లలకు రూ. 650 అని, పూర్తి వివరాలకు 90634 08477 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

నేడు బిచ్కుందకు మంత్రి కోమటిరెడ్డి రాక

నేడు బిచ్కుందకు మంత్రి కోమటిరెడ్డి రాక