
కళాశాల సరే.. భవనమేది.?
బాన్సువాడ: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల సమస్యలతో సతమతమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రభుత్వ కళాశాలకు సొంత భవనం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో 2021లో ప్రభుత్వం జూనియర్ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల ప్రారంభమైన నాటి నుంచి స్థానిక ఉన్నత పాఠశాలలోనే కళాశాల నిర్వహణ కొనసాగుతోంది. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, డీటీఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో ముగ్గురు రెగ్యులర్ అధ్యాపకులు ఉండగా ఏడుగురు ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారు. బీర్కూర్ మండల కేంద్రంతో పాటు దామరంచ, నస్రుల్లాబాద్ మండలంలోని మీర్జాపూర్‌లో మూడు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఇంటర్ కోసం బాన్సువాడ, బోధన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కానీ బీర్కూర్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజురు కావడంతో ఆయా ప్రాంతాల విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. కానీ కళాశాలకు సొంత భవనం లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో ఉన్న గదుల్లో తరగతుల నిర్వహణ కొనసాగుతుండడంతో విద్యార్థులు ఈ కళాశాలలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. చుట్టు పక్కల గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలకు రావాలంటే బీర్కూర్‌కు బస్సు సౌకర్యం లేదు. మిర్జాపూర్, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన విద్యార్థులు కళాశాలలో చేరాలని ఉన్నా బీర్కూర్‌కు బస్సు సౌకర్యం లేక బాన్సువాడకు వెళ్తున్నారు. బరంగెడ్గి, బైరాపూర్, సంబపూర్ గ్రామాల్లో ఉండే విద్యార్థులు చాలా మంది బీర్కూర్‌కు రావాలని ఉన్నా సరైన సమయంలో బస్సు సౌకర్యం లేక బాన్సువాడ, బోధన్‌కు వెళ్తున్నారు. పలుమార్లు ఇక్కడి అధ్యాపకులు, నాయకులు ఆర్టీసీ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. కళాశాలకు సొంత భవనం నిర్మాణం చేపట్టి, బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.
నాలుగేళ్లుగా ఉన్నత పాఠశాలలో
కొనసాగుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్వహణ
బస్సు సౌకర్యం లేక కళాశాలలో
చేరేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు
బీర్కూర్ ప్రభుత్వ జూనియర్
కళాశాలకు పక్కా భవనం
నిర్మించాలని విద్యార్థుల వేడుకోలు
ఆర్టీసీ అధికారులకు విన్నవించాం
బీర్కూర్ చుట్టు పక్కల గ్రామాల నుంచి విద్యార్థులు వస్తున్నారు. కానీ బస్సు సౌకర్యం లేక చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించాం. మిర్జాపూర్, తిమ్మాపూర్ గ్రామాల నుంచి సుమారు 20 మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది. కానీ బస్సు సమస్యతో కళాశాలలో చేరడం లేదు. అధికారులు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి.
–మోహన్‌రెడ్డి,
ఇన్‌చార్జి ప్రిన్సిపల్, బీర్కూర్