
‘వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి’
విద్యార్థితో మాట్లాడుతున్న అబ్జర్వర్ ఒడ్డెన్న
నిజాంసాగర్ : విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ కళాశాలలకు గుర్తింపు వస్తుందని ఇంటర్ బోర్డు అబ్జర్వర్ ఒడ్డెన్న పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, సామగ్రి, లెక్చరర్ల వివరాలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లను మరింత పెంచాలన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు చేర్చుకోవాలని సూచించారు. అధ్యాపకుల్లో మార్పు వస్తేనే విద్యార్థుల్లో మార్పు వస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం లేకపోవడంతోపాటు వసతి గృహ సదుపాయం లేనందన విద్యార్థులు కళాశాలలో చేరడానికి వెనకడుగు వేస్తున్నారని లెక్చరర్లు తెలిపారు. ఆయా సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని ఒడ్డెన్న పేర్కొన్నారు. జూనియర్ కళాశాలకు సొంత భవనం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామన్నారు. ఆయన వెంట ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ అహ్మద్ ఫారుఖ్ తదితరులున్నారు.
హాజరు శాతాన్ని పెంచండి
పిట్లం: మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని ఒడ్డెన్న అధ్యాపకులకు సూచించారు. శుక్రవారం ఆయన పిట్లం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి, అధ్యాపకులతో సమావేశమయ్యారు. మండలంలో మొత్తం 569 మంది విద్యార్థులు పదో తరగతి పాసయ్యారని, ఇందులో 119 మంది మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరారని పేర్కొన్నారు. ఎందుకు విద్యార్థుల జాయినింగ్ శాతాన్ని పెంచలేదని ప్రశ్నించారు. విద్యార్థుల సంఖ్య పెంచాలని ఆదేశించారు. కళాశాలలో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రతినెల రూ. 12 వేల చొప్పున నిధులు మంజూరవుతున్నాయన్నారు. ఇంకా ఏమైనా అవసరం ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రికార్డులను పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా నమోదు చేయాలని సూచించారు.