
ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలి
కామారెడ్డి క్రైం : ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ప్రణాళికబద్ధంగా చదవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ విద్యార్థులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని రికార్డులు, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థుల హాజరును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. హాజరు శాతం మెరుగయ్యేలా శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. రోజూ పాఠశాలకు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. ట్రిపుల్ ఐటీలో సీటు సాధించేలా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. అనంతరం వన మహోత్సవంలో భాగంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్, విద్యాశాఖ సమన్వయకర్త వేణుగోపాల్, హెచ్‌ఎం కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలి
కామారెడ్డి క్రైం: అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. అమృత్ పథకంలో భాగంగా నిర్మాణంలో ఉన్న పైప్‌లైన్ పనులను పరిశీలించి ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, మెగా సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు ఇచ్చారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నీటి సరఫరా కోసం ప్రత్యేకంగా పైప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం కొత్త బస్టాండ్ ప్రాంతంలో డ్రెయినేజీ పూడికతీత పనులను పరిశీలించారు. వ్యర్థాలను వెంటనే అక్కడి నుంచి తొలగించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ రాజేందర్ తదితరులున్నారు.