
వామ్మో పులులు!
● రెడ్డిపేట అడవిలో గాండ్రించిన పులి
● రాజమ్మ తండా ప్రాంతంలో
సంచరించిన చిరుత
● అటవీ ప్రాంత గ్రామాల్లో
భయాందోళనలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను ఓ వైపు పులి.. మరోవైపు చిరుతలు వణికిస్తున్నాయి. ఆవుపై పులి దాడి చేసిన సంఘటనతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై దాని జాడ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే మరోవైపు చిరుత మరో ఆవుపై దాడి చేసి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ అటవీ ప్రాంతంలో ఈనెల 10న పెద్దపులి ఆనవాళ్లు వెలుగు చూశాయి. 12న కామారెడ్డి జిల్లాలోని రెడ్డిపేట స్కూల్ తండా సమీపంలోగల అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసింది. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా అధికారులు పులి జాడ కోసం అడవిని జల్లెడ పడుతున్నారు. ఇరవై చోట్ల కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు. దాని ఆచూకీ కోసం నాలుగు బృందాలు అన్వేషిస్తున్నా ఫలితం లేదు. పులి తిరిగిన ఆనవాళ్లు దొరికినప్పటికీ పులి ఎక్కడ ఉందన్న దానిపై స్పష్టత రావడం లేదు. మరోవైపు ఈనెల 13న నిజామాబాద్ నగరంలోని నాగారం సమీపంలో చిరుత కనిపించింది. గురువారం రాత్రి రామారెడ్డి మండలంలోని గోకుల్ తండా ప్రాంతంలో ఓ ఆవుపై చిరుత దాడి చేసి చంపేసింది. ఇలా అటు పులి, ఇటు చిరుతల సంచారంతో అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
మేతకు తీసుకు వెళ్లాలంటేనే వణుకు..
పశువులు, మేకలను పోషిస్తూ జీవించేవారు వాటిని మేత కోసం అటవీ ప్రాంతాలకు తీసుకువెళుతుంటారు. అయితే పులి, చిరుతల సంచారంతో వారు భయపడుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సంఘటనలు జరగడంతో ఎక్కడ తమపై దాడి చేస్తాయోనని వణుకుతున్నారు. మాచారెడ్డి, రామారెడ్డి, సదాశివనగర్, సిరికొండ మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో చాలా గ్రామాల ప్రజలు పశువులు, మేకలను అడవులకు తీసుకువెళ్లేవారంతా భయంతోనే వెళుతున్నారు. కొందరు ఇంతకుముందులా అడవి లోపలికి వెళ్లడం లేదని చెబుతున్నారు. అలాగే అడవిని ఆనుకుని ఉన్న పంట చేల వద్దకు వెళ్లడానికి కూడా రైతులు, కూలీలు భయపడాల్సిన పరిస్థితి ఉంది. పొలం పనులకు వెళ్లినవారు చీకటి పడకముందే ఇళ్లకు చేరుకుంటున్నారు. రాత్రి పూట పొలాలవైపే చూడడం లేదు.
అటవీ అధికారులకు సవాల్..
అడుగుల ఆనవాళ్లతో పులి వచ్చిందని కచ్చితమైన నిర్ధారణకు వచ్చిన అటవీ అధికారులు.. దాని కదలికలను పసిగట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా దాని జాడ కోసం వెతుకుతున్నారు. పులి ఏదేని పరిస్థితుల్లో వేటగాళ్ల ఉచ్చుకు బలైతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అందుకే నాలుగు బృందాలు అడవిలో జల్లెడపడుతున్నాయి. పులి కదలికలను గుర్తించేందుకు కెమెరా ట్రాప్‌లు ఏర్పాటు చేసినా ఫలితం లేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం రెడ్డిపేట అడవిలో పులి తిరిగిన ప్రాంతాన్ని అటవీ శాఖ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఏలు సింగ్ మేరు, జిల్లా అటవీ అధికారి నిఖిత, కామారెడ్డి డీఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పరిశీలించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు.
వన్య ప్రాణుల సంరక్షణ అందరి బాధ్యత
రామారెడ్డి: మండలంలోని స్కూల్‌తండాతోపాటు ఇందల్వాయి అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తోందని రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(వన్యప్రాణుల సంరక్షణ) ఏలుసింగ్ మేరు తెలిపారు. పులి కోసం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నా దాని జాడ కనిపించలేదని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్కూల్ తండా పరిధిలోని అటవీ ప్రాంతంలో పర్యటించారు. ఆవుపై పెద్దపులి దాడి చేసిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో చాటింపు వేయించి పెద్దపులి సంచరిస్తున్న విషయాన్ని తెలియజేశామన్నారు. వారం రోజులుగా అటవీ సిబ్బంది పెట్రోలింగ్ చేస్తున్నారన్నారు. అటవీ జంతువులకు హాని కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌వో నిఖిత హెచ్చరించారు. పులిపై విషప్రయోగం జరిపిన ఘటనలో ఇప్పటికే నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయాన్ని తెలిపారు. క్రూరమృగాలు కనిపిస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందిస్తే తొందరగా వాటిని పట్టుకునేందుకు వీలవుతుందన్నారు. వారం రోజులుగా వెతుకుతున్నా పులి కనిపించడం లేదంటే అది వెళ్లిపోయినట్లు కాదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ ఎస్పీ చైతన్యరెడ్డి, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దూడను చంపింది చిరుతే..
రామారెడ్డి: గోకుల్ తండాలో గురువారం రాత్రి పెద్దపులి సంచారంపై అటవీశాఖ అధికారులు స్పందించారు. ఆవుపై దాడి చేసింది పెద్దపులి కాదని చిరుతపులి అని తేల్చారు. ట్రాక్ కెమెరాలో ఈ దాడి నిక్షిప్తమైందని పేర్కొన్నారు. అలాగే చిరుత దాడి చేసింది ఆవుపై కాదని, లేగ దూడపై అని తెలిపారు. శుక్రవారం లేగ దూడకు పోస్టుమార్టం నిర్వహించిన అధికారులు.. వైకుంఠధామం పక్కనే దహనం చేశారు. పులి జాడ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

వామ్మో పులులు!