
మంత్రి ఆదేశాలను అమలు చేయాలి
కామారెడ్డి టౌన్: జుక్కల్‌లో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఆయా అంశాలను పక్షం రోజుల్లో కార్యాచరణలోకి తీసుకురావాలన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం జిల్లాలో అదనంగా అవసరమైన సబ్ స్టేషన్ల మంజూరు కోసం ఎన్పీడీసీఎల్ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపాలని ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌ను ఆదేశించారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్‌ఈకి సూచించారు. జుక్కల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు, ట్రామాకేర్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని డీసీహెచ్‌ఎస్ విజయలక్ష్మిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా అటవీ భూములలో 159 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఆర్‌వోఎఫ్‌ఆర్ చట్టాల ప్రకారం నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్‌కు సూచించారు. పెద్దకొడప్‌గల్, పిట్లం మండలాలలో అధికారులు జొన్న పంట వివరాలను వాస్తవానికి విరుద్ధంగా నమోదు చేశారని, తద్వారా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతాయని ఆరోపణలు వచ్చాయని పేర్కొన్నారు. దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఏవో తిరుమల ప్రసాద్‌ను ఆదేశించారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, డీఎంహెచ్‌వో చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల తనిఖీ
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు యూనిఫాంలు పంపిణి చేశారు. పాఠశాలలోని ప్రతి విద్యార్థి అమ్మ పేరు మీద ఒక మొక్కను నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రాజు, మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సబ్‌స్టేషన్లు, ట్రామాకేర్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపండి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్