
పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం : గ్రామ పాలన అధికారి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ సూచించారు. హైదరాబాద్ నుంచి ఆయన కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆదివారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహించే గ్రామ పాలన అధికారి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
వీసీ అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ తన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. స్క్రీనింగ్ పరీక్ష నిర్వహణకు కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, జిల్లాలో 402 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. అనధికార వ్యక్తులను పరీక్షాకేంద్రంలోకి అనుమతించొద్దన్నారు. అభ్యర్థులను నిశితంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, గాడ్జెట్‌లకు అనుమతి లేదన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వి విక్టర్, ఆర్డీవో వీణ, చీఫ్ సూపరింటెండెంట్ విశ్వప్రసాద్, పరిశీలకులు శంకర్, కళాశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్, కలెక్టరేట్ ఏవో మసూద్‌అహ్మద్, పర్యవేక్షకురాలు జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.