స్థానికం నుంచి శాసనసభకు.. | - | Sakshi
Sakshi News home page

స్థానికం నుంచి శాసనసభకు..

Nov 2 2023 4:58 AM | Updated on Nov 2 2023 4:58 AM

- - Sakshi

నాగిరెడ్డిపేట: ‘ఇంట గెలిచి బయట గెలవాలి’అన్న సామెతకు అనుగుణంగానే ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో చాలామంది మాజీ ఎమ్మెల్యేలు గ్రామస్థా యి రాజకీయాల్లోనే ఓనమాలు దిద్ది శాసనసభలో అడుగుపెట్టారు. గ్రామస్థాయిలో రాజకీయంగా వారు వేసిన అడుగులే వారిని శాసనసభకు ఎంపికయ్యేలా చేశాయి. వార్డుసభ్యులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీ లు, పంచాయతీ సమితి అధ్యక్షులు, సహాకార సంఘాల చైర్మన్లుగా పనిచేసిన నాయకులెందరో శాసనసభలో అడుగుపెట్టారు. దీనిపై ప్రత్యేక కథనం.

బాన్సువాడ నియోజకవర్గం:

1989లో నిర్వహించిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలుపొందిన కత్తెర గంగాధర్‌ 1984–1989 వరకు బాన్సువాడ ఎంపీపీగా కొనసాగారు.

● 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి 1978లో దేశాయిపేట సొసైటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1981లో ఎల్‌ఎంబీ డైరెక్టర్‌గా, 1987లో డీసీసీబీ చైర్మన్‌గా పదవిలో కొనసాగారు.

ఆర్మూర్‌ నియోజకవర్గం:

1985లో నిర్వహించిన ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఏలేటి మహిపాల్‌రెడ్డి మొదట కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతోపాటు ఈయన భీమ్‌గల్‌ పంచాయతీ సమితి సభ్యుడిగా కొనసాగారు. అనంతరం టీడీపీ అభ్యర్థిగా ఆర్మూర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

● 1978, 1983, 1989 ఎన్నికల్లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన శనిగరం సంతోష్‌రెడ్డి 2001లో భీమ్‌గల్‌ జడ్పీటీసీగా గెలుపొంది జడ్పీ చైర్మన్‌గా కొసాగారు. జడ్పీచైర్మన్‌ పదవిలో కొనసాగుతున్నప్పుడే 2004లో నిర్వహించిన ఎన్నికల్లో జడ్పీచైర్మన్‌ పదవీకి రాజీనామా చేసి ఆర్మూర్‌ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నిజామాబాద్‌ రూరల్‌: 2008లో డిచ్‌పల్లి నియోజకవర్గానికి నిర్వహించిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆకుల లలిత అంతకుముందు మక్లూర్‌ ఎంపీపీగా కొనసాగారు.

● 2014లో నిర్వహించిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రూరల్‌ స్థానం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ మొదట 1881లో సిరికొండ మండలం చీమన్‌పల్లి సర్పంచ్‌గా కొనసాగారు. 1987లో కాంగ్రెస్‌ తరఫున సిరికొండ మండల పరిషత్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. 1995లో స్వతంత్ర అభ్యర్థిగా మండల పరిషత్‌ అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం 1999లో జరిగిన ఎన్నికల్లో ఆర్మూర్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి బాజిరెడ్డి గోవర్ధన్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు.

గ్రామ, మండల స్థాయిలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన మాజీ ఎమ్మెల్యేలు

కామారెడ్డి నియోజకవర్గం

కామారెడ్డి తొలి ఎమ్మెల్యేగా గెలుపొందిన నాగిరెడ్డిపేటకు చెందిన విఠల్‌రెడ్డిగారి వెంకట్రాంరెడ్డి సుమారు 25 ఏళ్లపాటు గ్రామ సర్పంచ్‌గా కొనసాగారు. 1952, 1957లో కామారెడ్డి, ఎల్లారెడ్డి ఉమ్మడి నియోజకవర్గంలో అన్‌రిజర్వ్‌డ్‌గా ఉన్న కామారెడ్డి స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సదాశివనగర్‌ మండలంలోని అడ్లూర్‌ ఎల్లారెడ్డికి చెందిన మధుసూదన్‌రెడ్డి 1967లో నిర్వహించిన ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అడ్లూర్‌ ఎల్లారెడ్డి జీపీ వార్డుసభ్యుడిగా, సర్పంచ్‌గా, సింగిల్‌విండో చైర్మన్‌గా కొనసాగారు.

1972లో నిర్వహించిన ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన వై.సత్యనారాయణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన నల్గొండజిల్లాకు చెందినవారు. ఈయన యుక్తవయసులో హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. మొదట సత్యనారాయణ తెలంగాణ ఫిషర్‌మెన్‌గా, సెంట్రల్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ చైర్మన్‌గా ఐదేళ్లపాటు పనిచేశారు. చట్టసభల్లో మత్స్యకారులకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో గంగపుత్రుడైన సత్యనారాయణకు కాంగ్రెస్‌ టికెట్‌ లభించింది.

1978లో చేపట్టిన ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బ్రాహ్మణపల్లి బాలయ్య పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన కామారెడ్డి జీపీ వార్డుసభ్యుడిగా, ఉపసర్పంచ్‌గా కొనసాగారు.

1983లో నిర్వహించిన ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుతో పోటీచేసిన పార్శి గంగయ్య కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈయన మొదట కామారెడ్డి మండలంలోని క్యాసంపల్లి సర్పంచ్‌గా కొనసాగారు. వ్యాపారరీత్యా కామారెడ్డిలో స్థిరపడిన గంగయ్య కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌గా పనిచేశారు.

1994లో తొలిసారిగా టీడీపీ నుంచి పోటీచేసి కామారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంప గోవర్ధన్‌ 1987లో భిక్కనూర్‌ మండలం బస్వాపూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌గా పనిచేశారు. 2004లో నిర్వహించిన ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీస్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. దీంతో 2004ఎన్నికల్లో గంప గోవర్ధన్‌ టీడీపీ తరఫున ఎల్లారెడ్డి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. 2009ఎన్నికల్లో మళ్లీ పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా 2011లో ఆయన తన పదవికి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో నిర్వహించిన ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. 2014, 2018లో చేపట్టిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతోపాటు రెండు పర్యాయాలు ఆయన ప్రభుత్వవిప్‌గా కొనసాగారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గం

లింగంపేట మండలం అయిలాపూర్‌ గ్రామానికి చెందిన తాడూరి బాలాగౌడ్‌ మొదట ఎల్లారెడ్డి పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. అనంతరం 1978 ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన బాలాగౌడ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాలాగౌడ్‌ టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి కేబినెట్‌లో చక్కెర పరిశ్రమ, రోడ్లు–భవనాలశాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యే పదవి ముగిసిన అనంతరం బాలాగౌడ్‌ నిజామాబాద్‌ జడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. అనంతరం 1984, 1989 వరుస పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసి ఎంపీగా రెండుపర్యాయాలు కొనసాగారు.

లింగంపేట మండలం లొంకలపల్లికి చెందిన లింగారెడ్డిగారి కిషన్‌రెడ్డి 15 ఏళ్ల పాటు సర్పంచ్‌గా కొనసాగారు. దీంతోపాటు సుమారు 17 ఏళ్లు సొసైటీ చైర్మన్‌గా కొనసాగారు. ఇదే సమయంలో ఏడేళ్ల పాటు డీసీసీబీ డైరెక్టర్‌గా పనిచేశారు. 1983లో నిర్వహించిన ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌కు చెందిన యెర్వ శ్రీనివాస్‌రెడ్డి సర్పంచ్‌ పదవిలో కొనసాగుతున్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎన్టీఆర్‌ మధ్యంతరంగా రద్దుచేశాడు. దీంతో తాండూర్‌ సర్పంచ్‌గా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి టీడీపీ తరఫున ఎల్లారెడ్డి అసెంబ్లీ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

గాంధారికి చెందిన నేరేళ్ల ఆంజనేయులు మొదట 1981లో ఎల్లారెడ్డి పంచాయతీ సమితి కో–ఆప్షన్‌ సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1987లో ఆయన గాంధారి సహకార సంఘం చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దీంతోపాటు నిజామాబాద్‌ ఎన్‌డీసీసీబీ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 1988లో గాంధారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 1989లో ఎల్లారెడ్డి అసెంబ్లీస్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 1994, 1998లలో వరుసగా ఎమ్మెల్యేగా గెలుపొంది ఎల్లారెడ్డి చరిత్రలో హ్యాట్రిక్‌ సాధించిన నేతగా గుర్తింపు పొందారు.

నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామానికి చెందిన బి.జనార్దన్‌గౌడ్‌ 1987లో గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై మండల పరిషత్‌ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 2007లో తాండూర్‌ సొసైటీ చైర్మన్‌గా ఎన్నికై న ఆయన 2008లో ఎల్లారెడ్డి స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

లింగారెడ్డిగారి కిషన్‌రెడ్డి 1
1/5

లింగారెడ్డిగారి కిషన్‌రెడ్డి

బి. జనార్దన్‌గౌడ్‌ 2
2/5

బి. జనార్దన్‌గౌడ్‌

నేరేళ్ల ఆంజనేయులు 3
3/5

నేరేళ్ల ఆంజనేయులు

యెర్వ శ్రీనివాస్‌రెడ్డి 4
4/5

యెర్వ శ్రీనివాస్‌రెడ్డి

తాడూరి బాలాగౌడ్‌ 5
5/5

తాడూరి బాలాగౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement