నమ్మించి.. మద్యం తాగించి.. అంతమొందించి.. ఆపై.. | - | Sakshi
Sakshi News home page

ఆస్తి కోసం నానమ్మ హత్య!

Aug 6 2023 12:38 AM | Updated on Aug 6 2023 9:45 AM

- - Sakshi

నిజామాబాద్‌: ఆస్తి, నగల కోసం వరుసకు నానమ్మ అయ్యే మహిళను హత్య చేశాడో యువకుడు. మద్యం తాగించి అటవీ ప్రాంతంలో అంతమొందించి ఏమి ఎరుగనట్లు ఇల్లు చేరాడు. నిజాంసాగర్‌ మండలం మాగి శివారులోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలు.. పిట్లం మండల కేంద్రానికి చెందిన దత్తుకు ముగ్గురు భార్యలు ఉన్నారు.

మొదటి భార్య అంజవ్వ మనవడు సంతోష్‌, మూడో భార్య శోభారాణి(45)ని ఈ నెల 2న నిజాంసాగర్‌ ప్రాజెక్టు సందర్శనకు బైక్‌పై తీసుకొచ్చాడు. ప్రాజెక్టును చూసిన తర్వాత బైక్‌పై నిజాంసాగర్‌కు చేరుకున్నారు. అక్కడ మద్యం తీసుకున్న సంతోష్‌ నానమ్మను మాగి శివారులోని అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. అనంతరం సంతోష్‌, శోభారాణి తలపై కర్రతో కొట్టి చంపాడు. అనంతరం సాయంత్రం వేళ పిట్లం చేరుకున్నాడు.

రాత్రి వరకు శోభారాణి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సంతోష్‌ను అడుగగా పిట్లంలో దించినట్లు చెప్పాడు. కుటుంబ సభ్యులు పిట్లం పోలీస్‌ స్టేషన్‌లో శోభారాణి మిస్‌ అయినట్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని సంతోష్‌ను విచారించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సంతోష్‌ను అదుపులోకి తీసుకు న్న పోలీసులు ఘటన స్థలానికి తీసుకువచ్చారు. ఘటన స్థలాన్ని సీఐ మురళి పరిశీలించారు. శోభారాణి ఒంటిపైన ఉన్న నగలతో పాటు ఆస్తి కోసం సంతోష్‌ హత్య చేసినట్లు స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement