ఆదర్శ పురుషుడు, మర్యాదా పురుషోత్తముడు, సత్యవాక్పరిపాలకుడు, సీతావల్లభుడు, సకల గుణధాముడైన జగదభిరాముడి కల్యాణానికి జిల్లా ముస్తాబయ్యింది. రామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భక్తులు ఏర్పాట్లు చేశారు. మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా వేద మంత్రోచ్ఛారణల మధ్య రామచంద్రుడు సీతమ్మను మనువాడే క్రతువును వీక్షించడానికి భక్తకోటి ఎదురుచూస్తోంది.
తిర్మలాపూర్‌లో కొలువైన సీతారాములు
గౌరారంలోని శ్రీరామాంజనేయ స్వామి ఆలయం ముందున్న కోనేరు
సాక్షి, కామారెడ్డి: వసంత రుతువులో చైత్ర శుద్ధ నవ మి నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. చైత్ర శుద్ధ నవమి నాడే సీతారాముల కల్యాణ మహోత్సవం జరిగింది. సీతారాములు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని అయోధ్యను చేరిందీ ఇదే రోజని పురాణాలు చెబుతున్నాయి. పితృవాక్య పరిపాలకుడైన కౌసల్యారాముడు.. సకల గుణాభిరాముడిగా కీర్తింపబడ్డాడు. ధర్మానికి నిలువెత్తు రూపంగా వర్ణింపబడ్డాడు. ఆ మహనీయుడి జన్మదినాన్ని, కల్యాణ మహోత్సవాన్ని గురువారం వాడవాడలా నిర్వహించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సీతారాముల కల్యాణం అనంతరం పెద్ద ఎత్తున అన్నదానాలు నిర్వహిస్తారు. పలుచోట్ల రథోత్సవాలు, కుస్తీ పోటీలు కూడా జరుగుతాయి.
జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో దశాబ్దాలుగా శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. మాచారెడ్డి మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న శాంతానంద తపోవనాశ్రమంలో రాములోరి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్ రామాలయంలో, ఎల్లారెడ్డి పట్టణంలోని రామాలయంలో వారం పాటు ఉత్సవాలు జరుగుతాయి. లింగంపేట రామాలయంలో మూడు రోజలు పాటు ఉత్సవాలు జరుగుతాయి. రథోత్స వం, ఎడ్ల బండ్ల ఊరేగింపు, అన్నదానం నిర్వహిస్తారు. బాన్సువాడ పట్టణం, తిర్మలాపూర్‌లలోని రామాలయాలు, దోమకొండలోని శివరాం మందిర్, తాడ్వాయి శబరిమాత ఆశ్రమం, నాగిరెడ్డిపేట మండల కేంద్రం గోపాల్‌పేటలోని శ్రీ కోదండ రామాలయంతోపాటు చాలా హనుమాన్ ఆలయాలలోనూ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా పలు ప్రాంతాలలో భక్తులు ర్యాలీలు నిర్వహించనున్నారు.
శ్రీరామనవమి శోభాయాత్రను
విజయవంతం చేయండి
కామారెడ్డి టౌన్: శ్రీరామనవమిని పురస్కరించుకుని హిందూవాహిని, శ్రీరామ సేనల ఆధ్వర్యంలో గురువారం కామారెడ్డిలో నిర్వ హించనున్న శోభాయాత్రను జయప్రదం చేయాలని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి కోరారు. బుధవారం ఆయన కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడా రు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి శోభాయాత్ర ప్రారంభమై పుర వీధుల గుండా సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు విపుల్ తదితరులు పాల్గొన్నారు.
నేడు శ్రీరామనవమి
ఉత్సవాలకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు
గౌరారంలో మూడు రోజులపాటు
జరగనున్న వేడుకలు
గౌరారంలో వేడుకలు విభిన్నం..
గాంధారి మండలం గౌరారంలోగల శ్రీరామాంజనేయ స్వామి ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది. ఆ ఊళ్లో అడుగిడగానే ఆధ్యాత్మికత కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఆలయానికి ముందు పెద్ద కోనేరు ఉంది. అందులో కాళ్లు కడుక్కుని ఆలయ ప్రాంగణంలోకి వెళతారు. ఈ ఆలయంలో దీపం ఐదు వందల ఏళ్లుగా అఖండంగా వెలుగుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. గర్భగుడిలోకి పూజారి ఒక్కరినే అనుమతిస్తారు. శ్రీరామనవ మి వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఊరు ఊరంతా వేడుకల్లో పాల్గొంటారు. వేడుకల సందర్భంగా గ్రామంలో నివసిస్తున్న 18 కులాల వారు ఆయా పనుల్లో భాగస్వాములవుతారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను వారు కొనసాగిస్తున్నారు. ఉత్సవాలకు ముందే గ్రామంలో రైతుల ఇళ్లకు వెళ్లి ఎకరాకు కుంచెడు బియ్యం చొప్పున సేకరిస్తారు. ఆ బియ్యాన్ని ఒక దగ్గర కుప్ప చేసి పెడతారు. ఉత్సవాల సందర్భంగా అన్నదానం చేస్తారు. ఉత్సవాలు జరిగినన్ని రోజులు అన్నదానం ఉంటుంది. గురువారం శ్రీరామనవమి వేడుకల సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవం జరిపిస్తారు. శుక్రవారం గండ దీపాలు వెలిగించి, రథోత్సవం నిర్వహిస్తారు. శనివారం గ్రామంలో కుస్తీ పోటీలు జరుగుతాయి. మూడు రోజలు పాటు జరిగే వేడుకలకు ఊరుఊరంతా హాజరవుతుంది. గ్రామస్తులు తమ బంధువులు, మిత్రులను సైతం వేడుకలకు ఆహ్వానిస్తారు.
మాట్లాడుతున్న వెంకటరమణారెడ్డి


