ముగిసిన ఏసీఏ బౌలింగ్‌ టాలెంట్‌ హంట్‌ | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏసీఏ బౌలింగ్‌ టాలెంట్‌ హంట్‌

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

నాగమల్లితోట జంక్షన్‌ (కాకినాడ సిటీ): ఆంధ్రా క్రికెట్‌ సంఘం ఆధ్వర్యంలో జిల్లా క్రికెట్‌ సంఘం సహకారంతో ఆర్‌ఎంసీ క్రీడామైదానంలో రెండు రోజులుగా కొనసాగుతున్న ఏసీఏ బౌలింగ్‌ టాలెంట్‌ హంట్‌ సోమవారంతో ముగిసింది. ఏసీఏ సీఓఓ గిరీష్‌ బౌలింగ్‌ స్వయంగా ఎంపికలను పర్యవేక్షించారు. ఏసీఏ కోచ్‌లు నగేష్‌, ఇజ్రాయేల్‌ రాజు ఎంపిక పోటీలు నిర్వహించారు. 600 మంది తమ పేర్లు నమోదు చేసుకోగా కంచి సురేంద్ర గంటకు 132 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేసి హంట్‌లో ఉత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. ఈ సందర్భంగా ఏసీఏ సీఓఓ గిరీష్‌ మాట్లాడుతూ జిల్లాలోని బౌలర్లు వేగంగా బౌలింగ్‌ చేస్తున్నారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్‌ సంఘ అధ్యక్షుడు హరిష్‌, ఉపాధ్యక్షుడు నావాజ్‌, కార్యదర్శి వెంకటేష్‌, ఈసీ మెంబరు సత్యానందం పాల్గొన్నారు.

సాంకేతిక లోపాలు సరి చేశాం!

కూలీలకు ఉపాధి కల్పనలో

ఇబ్బంది లేకుండా చర్యలు

పిఠాపురం: గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఉపాధి హామీ పథకంలో సాంకేతిక సమస్యలు సరి చేసి కూలీలకు ఉపాధి కల్పనలో ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు డ్వామా పీడీ ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షి దినపత్రికలో ఈ నెల 22వ తేదీన ‘‘మీరు వైఎస్సార్‌ సీపీ వాళ్లు .. ఉపాధి పని ఇవ్వం ’’ అనే శీర్షికన వెలువడిన వార్తకు అధికారులు స్పందించారు. దుర్గాడ వెంకయ్య చెరువులో పనులు నిర్వహిస్తున్న 5 గ్రూపులకు చెందిన 120 మంది ఉపాధి కూలీలకు మస్తరు వేసే క్రమంలో ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ లాగిన్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో వారికి ఉపాధి పనులు నిలిచిపోయాయన్నారు. దీంతో కూలీలు ఆందోళనకు దిగారని ఈ గ్రూపుల కూలీలందరికీ మేట్‌ల ద్వారా మస్తర్లు వేసే ఏర్పాట్లు చేశామని, ఎటువంటి రాజకీయ వ్యత్యాసాలు లేవని అధికారులు తెలిపారు.

‘పది’ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

పరీక్షలు ప్రారంభం

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): పదవ తరగగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు లాంగ్వేజ్‌ పరీక్షలో భాగంగా తెలుగు, కాంపోజిట్‌ తెలుగు పేపర్‌–1నిర్వహించారు. ఈ పరీక్షకు 1,445 మంది హాజరుకాగా 272మంది గైర్హాజరయ్యారు. ఓపెన్‌ స్కూల్‌ పరీక్షల్లో భాగంగా తెలుగు పరీక్ష నిర్వహించగా 799మంది హాజరుకాగా 168 మంది గైర్హాజరయ్యారు. ఇంటర్మీడియెట్‌ ఇంగ్లిష్‌ పరీక్షకు 1,201మంది హాజరుకాగా 174మంది గైర్హాజరయ్యారు. డీఈఓ పిల్లి రమేష్‌ మూడు పరీక్ష కేంద్రాలను, తనిఖీ అధికారులు మూడు కేంద్రాలు పరిశీలించారు.

గౌతమి బోర్డు తిప్పేసిందా?

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): కాకినాడలో జయలక్ష్మి, కార్తికేయ సొసైటీలు బాధితులను ముంచిన ఘటనలు మరవకముందే మరో సొసైటీ వ్యవహారం వెలుగు చూసింది. నగరంలోని జన్మభూమి పార్క్‌ వద్దన్న గౌతమి సిటిజన్స్‌ పరస్పర సహాయ సహకార పొదుపు సంఘం బోడ్డు తిప్పేసిందన్న సమాచారంతో డిపాజిట్‌దారులు గగ్గోలు పెడుతున్నారు. రెండు సంవత్సరాల నుంచి సహకార సంఘాలు సభ్యుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లు గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు సహకార సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌ విచారణ చేయాలని జిల్లా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. గౌతమి సొసైటీ చైర్మన్‌ వాకలపూడి తిరుపతిరాయుడు నగరంలోని రిటైర్డు ఉద్యోగుల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించినట్లు తెల్సింది. సంఘంలో పొదుపు చేసిన డిపాజిట్‌దారులు ఈ నెల 29, 30 తేదీల్లో స్థానిక ఎన్‌ఎఫ్‌ఎల్‌ రోడ్‌లోని సహకార సంఘ కార్యాలయంలో ఒరిజినల్‌ రసీదులతో హాజరు కావాలని డిపాజిట్‌దారులకు వర్తమానాలు అందాయి. గౌతమి సహకార సంఘంపై విచారణ చేయాలని కాకినాడ సహకార శాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ జె శివకామేశ్వరరావును ఆదేశించారు. ఈ మేరకు ఆయన ఈనెల 29,30 తేదీల్లో బాధితుల నుంచి వాంగ్మూలాలు తీసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా సహకార అధికారి శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా సంఘ చైర్మన్‌కు నోటీస్‌ ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement