కడలికి కల్యాణ శోభ.. | - | Sakshi
Sakshi News home page

కడలికి కల్యాణ శోభ..

May 24 2026 12:45 AM | Updated on May 24 2026 12:45 AM

ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లకు వేదికగా

సాగరతీరం

బోటులో ఫొటో షూట్‌, క్యాంప్‌ఫైర్‌లు

యువతను ఆకట్టుకుంటున్న

సుందర దృశ్యాలు

ప్రాతః.. సాయం సంధ్యలలో సాగరాలు..

తీరాలు.. ఇసుక తిన్నెలు.. ఒడ్డున ఉండే నున్నని రాళ్లు.. వాటిపై ఉవ్వెత్తున ఎగసి విరుచుకుపడే అలలు.. వీచే బలమైన గాలులకు ఆ అలల అంచుల విన్యాసాలు.. ఆ అంచులతో రవి కిరణ సంయోగాలు.. ఒకటా రెండా.. వర్ణనకు అందని సాగర సోయగాలు ఎన్నో. రవి కాంచని చోట కవే కాదు.. కెమెరా కన్నూ కాంచును. ఆ అందాలను పొదివిపట్టి కొత్త కాంతులు అద్ది వారి జీవితాలకు కొత్తందాలు తెచ్చుకుంటున్నారు ఈనాటి యువత.

పిఠాపురం: ఆధునిక కాలంలో వివాహానికి ముందు జరిగే తంతుల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఒకటి వచ్చి చేరింది. మనసుకు కెమేరా కన్ను.. కళాదృష్టి ఉన్న ప్రతి ఒక్కరూ సాగరతీరాల సోయగాలను తన ఆల్బమ్‌లో బంధించకుండా ఉండడు. ఈ అందాలను ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లలో బంధించి వధూ వరుల చిత్రాలను మరింత అందంగా చిత్రించి చక్కని టైటిల్స్‌తో ఫొటో, వీడియో ఆల్బమ్‌లను తయారు చేసి సంక్షిప్త ఇన్విటేషన్లుగా వాట్సప్‌లలో పంపుతూ.. పూర్తిగా వివాహ వేడుకల్లో ప్రదర్శిస్తూ వేడుకను మరింత ద్విగుణీకృతం చేస్తున్నారు.

ఆ మధ్య అంతగా సినిమా షూటింగ్‌లు లేకపోయినా ఉప్పెన చిత్రంతో మళ్లీ పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ సాగర తీరంలో క్లాప్‌లు, రోల్‌ కెమేరాలు, యాక్షన్ల అరుపులు వినిపిస్తున్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా ప్రీ వెడ్డింగ్‌ షూట్లు సైతం చకచకా సాగిపోతున్నాయి. ఒకప్పుడు మంచు కురిసే వేళల్లో.. వసంత కాలాల్లో.. క్యాంప్‌ఫైర్‌ వీడియోలతో ఏజెన్సీ కళకళలాడేది. ప్రస్తుతం ట్రెండ్‌ మారింది. చాలా మంది నేడు ఈ షూట్‌ల కోసం సాగరతీరాల వైపు మొగ్గు చూపుతున్నారు.

కాకినాడ నుంచి తుని సమీపంలో అద్దరిపేట వరకు ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలో హోప్‌ఐలాండ్‌, మడ అడవులు పచ్చని చెట్లతో లోకేషన్లు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో ఇక్కడ షూటింగ్‌లు చేసేందుకు ఎక్కువ జంటలు ఆసక్తి చూపుతున్నారు.

ప్రీ వెడ్డింగ్‌ స్పాట్‌గా ఉప్పాడ

ఇప్పటి వరకు సినిమా షూటింగ్‌లకు నెలవుగా ఉన్న ఉప్పాడ సాగర తీరం ప్రీ వెడ్డింగ్‌ స్పాట్‌గా మారింది. ఈ ప్రాంతంలో షూటింగ్‌ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్తగా తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఉప్పుటేరుల్లో బోటు షికారు కొత్త ఆకర్షణగా నిలుస్తోంది. కాబోయే నూతన జంటల బోటు షికారు వీడియోలు ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.

సెట్టింగ్‌లతో పనిలేదు

కాకినాడ, ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు చేస్తే సెట్టింగ్‌లతో పని ఉండదు. ప్రకృతి అందాలే చాలు. స్థానికుల సహకారం చాలా బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్‌ షూట్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.

– సాగర్‌, డిజిటల్‌ ఫోటో వీడియో గ్రాఫర్‌, ఉప్పాడ

చాలా థ్రిల్‌ ఫీలయ్యాం

సాధారణంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ అంటే ఎక్కడో మారేడుమిల్లి, గుడిసె వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. కాని ఉప్పాడ సాగరతీరం అంటే ఎలా ఉంటుందో అనుకున్నాం. సాగరతీర అందాలు మమ్మల్ని కట్టి పడేసాయి. బోటు షికారు వీడియో చాలా బాగుంది. ఇసుక తిన్నెల్లో క్యాంప్‌ఫైర్‌ బాగుంది. ఇక్కడ షూటింగ్‌ వల్ల డబ్బు, సమయం ఆదా అయ్యాయి.

– గోపీనాథ్‌, కాకినాడ

ఉషోదయాన సిందుర వర్ణపు సాగరంలో

ఓ జంట లాహిరి..

ఉప్పాడ సాగరతీరం ఏరియల్‌ వ్యూ

Advertisement
 
Advertisement
Advertisement