రెక్కలు ముక్కలు చేసుకుంటూ పని చేద్దామని వెళ్లిన వారి ప్రాణాలే బలైపోయాయి. కష్టపడితే కాస్తయినా ఆకలి తీరుతుందని ఆశ పడితే ఆయువే తీరిపోయింది. సెల్ సిగ్నల్ లేక మస్టర్ల కోసం రోడ్డు పైకి వచ్చిన ‘ఉపాధి’ శ్రామికుల మీదికి.. ఓ టిప్పర్ మృత్యు శకటంలా దూసుకువచ్చింది. తోటి శ్రామికుల కళ్ల ముందే.. నలుగురి నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
● ‘ఉపాధి’ కూలీలపై మృత్యుపంజా ● నలుగురిని బలిగొన్న టిప్పర్ ● విషమంగా మరో ఇద్దరి పరిస్థితి ● చీడిగలో విషాద ఛాయలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/కాకినాడ క్రైం: తెల్లారకుండానే పొట్టకూటి కోసం వెళ్లిన ఆ ఉపాధి కూలీల బతుకులు తెల్లారిపోయాయి. కాకినాడ రూరల్ కొవ్వూరు బైపాస్ వంతెన వద్ద శనివారం ఉదయాన్నే అతి వేగంగా వచ్చిన టిప్పర్.. ఉపాధి కూలీల మీద నుంచి దూసుకుపోవడంతో నలుగురు మహిళలు సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. సంఘటన స్థలంలో రక్తమోడుతూ చెల్లాచెదురుగా పడి ఉన్న మహిళల మృతదేహాలను చూసి స్థానికులు, తోటి శ్రామికులు, చూపరులు కంట తడి పెట్టుకున్నారు. రెక్కాడితేనే కానీ డొక్కాడని బడుగుల కుటుంబాల్లో ఈ సంఘటన పెను విషాదాన్ని మిగిల్చింది.
సెల్ సిగ్నల్ లేక రోడ్డు పైకి..
కాకినాడ రూరల్ చీడిగ గ్రామం నుంచి రోజూ మాదిరిగానే మూడు బృందాలుగా సుమారు 60 మంది కూలీలు శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో కొవ్వూరు చేరుకున్నారు. ఉపాధి హామీ పథకం కింద కొవ్వూరు వద్ద పంట కాలువలో పూడికతీత పనులకు వచ్చారు. వారు పని చేస్తున్న ప్రాంతంలో మస్టర్ వేసేందుకు సెల్ సిగ్నల్ అందుబాటులో లేదు. దీంతో, ముందుగా రోడ్డు పైనే మస్టర్లు తీసుకుని, తరువాత పనుల్లో పాల్గొంటున్నారు. మస్టర్లు రికార్డు చేసి, ఫొటోలు తీసుకునేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రబాబు కూలీలను కొవ్వూరు వంతెన వద్దకు పిలిచాడు. రెండు బృందాల మస్టర్లు పూర్తయ్యాయి.
అదుపు లేని వేగంతో..
మూడో బృందంలో 20 మందికి మస్టర్లు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఓ లే అవుట్‌లో గ్రావెల్ లోడ్ దించి, తూరంగి వైపు నుంచి చీడిగ వైపు ఓ టిప్పర్ వేగంగా వచ్చింది. మస్టర్లు పూర్తయిన 12 మందిని దాటి, తరువాత ఉన్న ఎనిమిది మంది పైకి అదుపు లేని వేగంతో దూసుకు వచ్చింది. ప్రమాదాన్ని గమనించి అప్రమత్తమైన గుడివాడ వీరమణి, దెయ్యాల గణికమ్మ రోడ్డు పక్కకు దూకేసి ప్రాణాలు దక్కించుకున్నారు. మిగిలిన ఆరుగురిలో కాదా చిట్టెమ్మ, వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చెల్లూరు అన్నవరం సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మట్టపర్తి అరుణకుమారి, పాలిక నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. నాగమణి కాకినాడ జీజీహెచ్‌లో, అరుణకుమారి మెయిన్ రోడ్డులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పని చేస్తున్న చోటనే సెల్‌ఫోన్ సిగ్నల్స్ వచ్చి ఉంటే.. అసలు ఈ ప్రమాదం జరిగి ఉండేదే కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నుజ్జయిన దేహాలు
నలుగురు మృతుల దేహాలు టిప్పర్‌కు, రోడ్డు మార్జిన్‌లోని ఇనుప గడ్డర్లతో ఉన్న రెయిలింగ్‌కు మధ్య నలిగిపోయి, నుజ్జునుజ్జయ్యాయి. ఒక మహిళ తలభాగం గుర్తు పట్టలేనంతగా చిన్నాభిన్నమైపోయింది. మరో మహిళ పొత్తి కడుపు నుంచి పేగులు బయటకు వచ్చేసి, చేతులు విరిగిపోయాయి. కాకినాడ జీజీహెచ్‌లో మృతదేహాలను చూసి, కన్నీరు మున్నీరైన బంధువులను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ప్రమాద తీవ్రతను చూసి, అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటున్న రైతులు, కూలీలు భీతావహులయ్యారు. ఇటువంటి దారుణమైన పరిస్థితి పగవాడికి కూడా రాకూడదు దేవుడా అంటూ సత్యనారాయణ అనే రైతు కన్నీటి పర్యంతమయ్యారు.
జీజీహెచ్‌లో ఆందోళన
నలుగురు మహిళల మృతదేహాలకు జీజీహెచ్‌లో పోస్ట్‌మార్టం పూర్తి చేశారు. బాధిత కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలంటూ జీజీహెచ్ మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. వారిని అన్నివిధాలా ఆదుకుంటామని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ హామీ ఇచ్చారు. మృతుల అంత్యక్రియలకు రూ.25 వేలు చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించామని ఆర్‌డీఓ మల్లిబాబు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ అంశాన్ని తనతో పాటు డ్వామా పీడీ మధుసూదనరావు, కాకినాడ అర్బన్, రూరల్ తహసీల్దార్లు జితేంద్ర, కుమారి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
డ్రైవర్ మద్యం మత్తే కారణమా!
డ్రైవర్ డోలా నాగరాజు మద్యం మత్తులో టిప్పర్ నడపడం వల్లనే నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయని, ఈ ప్రమాదం నుంచి బతికి బయట పడిన కూలీలు విలపించారు. మద్యం మత్తులో ఉన్నందువల్లనే ఎడమవైపు వెళ్తున్న టిప్పర్‌ను డ్రైవర్ ఒక్కసారిగా కుడివైపు తిప్పేశాడని, అందువల్లనే ఇంతటి ఘోరం జరిగిందని చెబుతున్నారు. ప్రమాదం అనంతరం ఇక్కడ ప్రమాదం జరిగిందా అంటూ తూలిపోతూ డ్రైవర్ నాగరాజు తమను ఎదురు ప్రశ్నించాడని స్థానిక కూలీలు తెలిపారు. డ్రైవర్ నాగరాజు మద్యం తాగి నిర్లక్ష్యంగా, అతి వేగంగా టిప్పర్‌ను నడపటమే ప్రమాదానికి కారణమని పోలీసులు కూడా తొలుత చెప్పారు. అయితే, రాత్రంతా గ్రావెల్ ట్రిప్పులు వేయడంతో నాగరాజుకు తెల్లవారుజామున నిద్ర మత్తు ముంచుకొచ్చిందని, అందువల్లనే ఈ ప్రమాదం జరిగిందనే వాదన కూడా వినిపిస్తోంది. ప్రమాదానికి అసలు కారణాన్ని పోలీసులు ఇంకా నిర్ధారించ లేదు. దర్యాప్తులో తేలాల్సి ఉందని చెబుతున్నారు. ప్రమాదం అనంతరం పరారవుతున్న డ్రైవర్ నాగరాజును తోటి కూలీలే వెంబడించి పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. ఆ రోడ్డుకు ఇరువైపులా రైతులు ధాన్యం రాశులు వేసి బరకాలు కప్పారు. బైపాస్ రోడ్డు పొడవునా ఇటువంటి ధాన్యపు రాశులు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు.
విచ్చలవిడి మద్యంతోనే..
ఎక్కడికక్కడ మద్యం ఏరులై పారుతున్నా చంద్రబాబు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తూండటం వల్లనే ఇటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త కురసాల కన్నబాబు విమర్శించారు. సంఘటన జరిగిన వెంటనే ఆయన కాకినాడ జీజీహెచ్‌కు వచ్చి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని చూసి, బంధువులకు ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు మొక్కుబడి సాయంతో సరిపెట్టి, అన్యాయం చేయకుండా, ఒక్కో కుటుంబానికి కనీసం రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించి, మానవత్వంతో ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు. మృతులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనన్నారు. ప్రమాద వివరాలను మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. కన్నబాబు వెంట పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి గణేష్ తదితరులున్నారు.


