కలెక్టరేట్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ | - | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్‌లో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

హెల్ప్‌లైన్‌ నంబర్‌ 98499 03879

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగంగా సేవలు అందించేందుకు, సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ శనివారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు, అత్యవసర వైద్య సదుపాయాలు, ప్రకృతి వైపరీత్యాలు, భూ ఆక్రమణలు, భూ దందాలు, అనధికార లే అవుట్లు, ఆకతాయిల బెదిరింపులు తదితర ఎటువంటి ఫిర్యాదులకై నా 98499 03879 నంబర్‌తో 24 గంటలూ పని చేసేలా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేశామని వివరించారు. దీనికి వాట్సాప్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కాల్‌ సెంటర్‌లోని సిబ్బంది ప్రతి కాల్‌ను స్వీకరించి, సంబంధిత అధికారులను వెంటనే అప్రమత్తం చేయడంతో పాటు సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు. అవినీతి సంబంధిత ఫిర్యాదులకు ప్రత్యేక అవినీతి నిరోధక టోల్‌ ఫ్రీ నంబర్‌ 14400ను కూడా ప్రజలు వినియోగించుకోవచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు.

ఐసెట్‌ ఫలితాల విడుదల

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఆంధ్రా యూనివర్సిటీ నిర్వహించిన ఐసెట్‌–26 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఈ పరీక్షలకు బాలుర విభాగంలో 475 మంది హాజరవగా 437 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 620 మందికి కాగా 596 మంది ఉత్తీర్ణత సాధించారు.

వైష్ణవి స్టేట్‌ ఫస్ట్‌

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐసెట్‌లో కాకినాడ విద్యార్థిని పట్నాల వైష్ణవి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. ఆమె విద్యాంజలి పాఠశాలలో పదో తరగతి (సీబీఎస్‌ఈ), ఆదిత్య కళాశాలలో ఇంటర్మీడియెట్‌ (ఎంఈసీ), సంజీవ్‌ కళాశాలలో డిగ్రీ పూర్తి చదివింది. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగడం తన లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పింది. సమాజంలోని సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలు లేదా ఉత్పత్తులు అందించాలని భావిస్తున్నట్టు చెప్పింది. ఆమె తండ్రి మోహనరావు కన్‌స్ట్రక్షన్‌ ఆఫీసులో అకౌంట్స్‌ ఆఫీసర్‌గా పని చేస్తున్నారు. తల్లి సత్యవతి గృహిణి.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

రంగంపేట: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్టు ఎస్సై శివప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం కాకినాడ ప్రతాప్‌ నగర్‌కు చెందిన మారోజు భాస్కర్‌ (24) శుక్రవారం అర్ధరాత్రి వడిశలేరు నుంచి తన మోటార్‌ సైకిల్‌పై కాకినాడ వెళ్తున్నాడు. రంగంపేట సమీపాన చాగల్నాడు కాలువ వద్దకు వచ్చేసరికి మోటార్‌ సైకిల్‌ అదుపు తప్పి అతడు కాలువలో పడిపో యి, అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి సూరిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

ములాఖత్‌ సమయంలో

మళ్లీ మార్పు

కాకినాడ లీగల్‌: వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ములాఖత్‌ సమయాల్లో కాకినాడ సబ్‌జైలు అధికారులు మరోసారి మార్పులు చేశారు. ఇప్పటి వరకూ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ములాఖత్‌కు అవకాశం ఉండేది. ఎండల కారణంగా ములాఖత్‌ సమయాన్ని ఉదయం 9 నుంచి 11 గంటల వరకూ మాత్రమే పరిమితం చేశారు. ఈ నిర్ణయంపై ముద్దాయిల కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో సమయాలను మళ్లీ సవరించారు. తాజాగా ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకూ, సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకూ ములాఖత్‌కు సమయం కేటాయించినట్లు కాకినాడ స్పెషల్‌ సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ ఎం.వీరబాబు తెలిపారు.

అప్పలరాజుపేట వద్ద పులి

రాజవొమ్మంగి: మండలంలోని అప్పలరాజుపేట సమీపాన ఏపీ ఫారెస్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) పెంచుతున్న యూకలిప్టస్‌ వనాల్లో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. పులి మెడలోని ట్రాకర్‌ ద్వారా అందిన శాటిలైట్‌ సమాచారాన్ని బట్టి శనివారం వేకువజామున 5 గంటలకు, తిరిగి ఉదయం 9 గంటలకు యూకలిప్టస్‌ వనాల్లో పులి సంచరించిందని స్థానిక అటవీ క్షేత్రాధికారి ఉషారాణి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement