పెట్రో ధరల పెంపుపై వినూత్న నిరసన | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరల పెంపుపై వినూత్న నిరసన

May 17 2026 12:30 AM | Updated on May 17 2026 12:30 AM

సామర్లకోట: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిరంతరం పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు ఆరోపించారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ పెద్దాపురం మరిడమ్మ ఆలయ సెంటర్‌లో సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యాన శనివారం నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. మండుతున్న ఎండలో మోకాళ్లపై నిలుచుని వినూత్నంగా నిరసన తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించాలనే డిమాండుతో మెయిన్‌ రోడ్డులో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, కేంద్రం తరచూ చమురు ధరలు పెంచుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ నోరు మెదపడం లేదని విమర్శించారు. చమురు ధరల పెంపుతో సామాన్యుల జీవితంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. రవాణా ఖర్చులు పెరిగిపోవడంతో అన్ని రకాల వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయని, ఖర్చు పెరిగిపోవడంతో పంటల సాగు రైతులకు భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు ధరల పెంపుతో ఆటో కార్మికులు, చిన్న వ్యాపారస్తులు, కూలీలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా ప్రజలకు ఎటువంటి ఉపశమనం ఇవ్వకుండా, ఎకై ్సజ్‌ సుంకాలు పెంచుతూ ప్రజలను దోచుకుంటున్నారని మధు ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, పెద్దాపురం నియోజకవర్గ కార్యదర్శి పెదిరెడ్ల సత్యనారాయణ, ఏఐటీయూసీ నాయకులు రామకృష్ణ, త్రిమూర్తులు, వెంకట్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement