బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో కాకినాడ సిటీ నియోజకవర్గానికి చెందిన ఇద్దరికి స్థానం కల్పించారు. పార్టీ బీసీ సెల్ సెక్రటరీగా అంకాడి సత్తిబాబు, రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీగా వాసిరెడ్డి శివప్రసాద్‌లను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రజల ప్రతిఘటన తప్పదు
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): తరచూ ధరలు పెంచుకుంటూ పోతే ప్రజల నుంచి ప్రతిఘటన తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తాటిపాక మధు హెచ్చరించారు. కేంద ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ జిల్లా సమితి ఆధ్వర్యాన స్థానిక మదర్ థెరిస్సా బొమ్మ నుంచి కల్పనా సెంటర్ వరకూ శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆటోలను, బైకులను తాళ్లతో లాగుతూ.. మోదీ ప్రధానిగా ఉంటే భవిష్యత్తులో ఇంకా ఇలాగే బతకాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ ధరలు పెరగవని ఇటీవలి ఎన్నికల సభల్లో మోదీ చెప్పారని, ఎన్నికలు పూర్తవగానే వీటి ధరలు పెంచారని విమర్శించారు. దీనివలన నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని, ప్రజలు మరింతగా ఆర్థిక ఇబ్బందులు పడతారని అన్నారు. దేశ ప్రజలంతా పొదుపు పాటించాలని, డీజిల్ వాడకూడదని, బంగారం కొనకూడదని చెప్పిన మోదీ.. ఆయన విదేశీ పర్యటనలకు, ఆయన వేసుకున్న సూట్‌కు ఎన్ని రూ.కోట్లు ఖర్చవుతోందో శ్వేతపత్రం విడుదల చేయాలని మధు డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఒక్క పూటే భోజనం చేయండి.. మరో పూట యోగా చేయండని అంటారేమోనని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
నిమ్మ ధర పతనం
దేవరపల్లి: మార్కెట్లో నిమ్మ ధర మరింత పతనమైంది. గత నెలలో కిలో కాయలకు రూ.130 నుంచి రూ.140 వరకూ ధర పలికింది. ముదర కాపులు దిగుబడులు తగ్గడంతో కాయలకు డిమాండ్ ఏర్పడింది. గత డిసెంబర్, జనవరి నెలల్లో కిలో రూ.8 నుంచి రూ.10 మాత్రమే ధర పలకగా, ఫిబ్రవరిలో రూ.40, మార్చిలో రూ.70, ఏప్రిల్‌లో ఏకంగా రూ.140కి పెరిగింది. కొద్ది రోజుల అనంతరం ఈ నెలలో ధర క్రమేపీ పతనమవుతూ వస్తోంది. యాదవోలు మార్కెట్లో కాయల నాణ్యత, సైజును బట్టి శుక్రవారం కిలోకు రూ.20 నుంచి రూ.30 మాత్రమే ధర లభించిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం లేత కాపులు అందుకోవడంతో మార్కెట్‌కు రోజుకు సుమారు 25 టన్నుల కాయలు అమ్మకానికి వస్తున్నాయని వ్యాపారులు తెలిపారు. నిమ్మకాయల సీజన్ ముగింపు దశకు చేరడం, లేత కాపుల్లో కాయ పరిమాణం తగ్గడంతో మార్కెట్లో ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు.
వెబ్‌సైట్‌లో సీనియారిటీ
తాత్కాలిక జాబితా
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యా శాఖ పరిధిలో పని చేస్తున్న ఉపాధ్యాయుల సీనియారిటీ తాత్కాలిక జాబితాను డీఈఓ.జీఓవీ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో ఉంచామని జిల్లా విద్యాశాఖాధికారి కె.వాసుదేవరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, మున్సిపల్ కార్పొరేషన్ల కింద పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయులు సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ (టీఐఎస్) ఆధారంగా రూపొందించారని వివరించారు. సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీ లోగా కాకినాడలోని పూర్వపు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
‘ఉపాధి’ సిబ్బంది సస్పెన్షన్
వీఆర్ పురం: ఉపాధి పనుల కల్పనలో, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న 10 మంది ఉపాధి హామీ సిబ్బందిపై కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. వీఆర్ పురం ఏపీఓ రెడ్డిబాబుతో పాటు నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి సస్పెండ్ చేశామని డ్వామా పీడీ మహేశ్వరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


