తుని రూరల్: ‘రెండు కాళ్లూ లేవు.. పింఛన్ ఇచ్చి కనికరించండి’ అంటూ కలెక్టర్ ఎంఎన్ హరేంధిర ప్రసాద్ ఎదుట దివ్యాంగురాలు చందక గౌరీశ్రీ కన్నీరు పెట్టుకుంది. ‘ఒక నెల – ఒక గ్రామం, నాలుగు సందర్శనలు’ (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని కలెక్టర్ తుని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ప్రజల సమస్యలు వింటూ నేరుగా అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తుని పట్టణం బత్తాయితోట వీధికి చెందిన చందక గౌరీశ్రీ తన తల్లి సూర్యకాంతంతో కలసి వచ్చి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసింది. తనకు తండ్రి లేడని, పేద కుటుంబమని, నలుగురు ఆడ, ఒక మగ సంతానంతో తల్లి కుటుంబాన్ని నెట్టుకువస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. అర్హత ఉండటంతో తల్లికి వితంతు, తనకు దివ్యాంగ పింఛన్లు కొన్నేళ్లు వచ్చాయని చెప్పింది. తన సోదరికి ఏఎన్‌ఎంగా ఉద్యోగం రావడంతో ప్రభుత్వం పింఛన్లను రద్దు చేసిందని, దీంతో, కుటుంబ జీవనం పెనుభారంగా మారిందని తెలిపింది. తమకు పింఛన్లు పునరుద్ధరించాలని, లేకపోతే ఆకలి చావులు తప్పవని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన కలెక్టర్.. వారికి పింఛన్ పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఎం సత్తిబాబును ఆదేశించారు. కాగా, పదుల సంఖ్యలో పింఛన్లు నిలిపివేశారని, కొత్త పింఛన్లు మంజూరు చేయాలని, రూ.15 వేల పింఛన్లు ఇవ్వాలని పలువురు అర్జీలు దాఖలు చేశారు. పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇంటి రుణాలు, రీసర్వే, ఆన్‌లైన్‌లో భూ రికార్డుల నమోదు, పంట నష్టం, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు, పట్టణంలో పారిశుధ్య నిర్వహణ తదితర అంశాలపై 165 అర్జీలు వచ్చాయని తహసీల్దార్ జీవీఎస్ ప్రసాద్, ఎంపీడీఓ జి.మరిడియ్య తెలిపారు. ప్రజల నుంచి అందిన అర్జీలను సమగ్రంగా పరిశీలించి, ప్రాధాన్య క్రమంలో త్వరగా పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. అర్జీలపై ప్రగతిని వారం రోజుల్లో వివరించాలన్నారు.


