20న మెడికల్‌ షాపుల బంద్‌ | - | Sakshi
Sakshi News home page

20న మెడికల్‌ షాపుల బంద్‌

May 16 2026 12:27 AM | Updated on May 16 2026 12:27 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఆన్‌లైన్‌ ఫార్మసీల అక్రమ కార్యకలాపాలు, కార్పొరేట్‌ సంస్థల ధరల తగ్గింపును నిరసిస్తూ ఈ నెల 20న జిల్లావ్యాప్తంగా మెడికల్‌ షాపులు బంద్‌ చేస్తున్నట్లు కాకినాడ జిల్లా డ్రగ్‌ ట్రేడర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.గిరిధర్‌ తెలిపారు. శ్రీనగర్‌లోని అసోసియేషన్‌ భవనంలో బంద్‌ పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఫార్మా రంగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పలుమార్లు విన్నవించినా పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఆన్‌లైన్‌ ఫార్మసీలను నిషేధించాలన్నారు. పెద్ద కార్పొరేట్‌ సంస్థలు భారీ డిస్కౌంట్లతో మందులు విక్రయిస్తూ స్థానిక మందుల దుకాణాల మనుగడకు ముప్పుగా మారుతున్నాయని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 12.40 లక్షల మంది కెమిస్టులు, డిస్ట్రిబ్యూటర్లపై ఆధారపడి నాలుగైదు కోట్ల మంది జీవిస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించకపోతే ప్రజారోగ్య వ్యవస్థ దెబ్బ తింటుందని చెప్పారు. కాకినాడ కెమిస్ట్స్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ నగర అధ్యక్షుడు సాయిరాం సత్యనారాయణ మాట్లాడుతూ, బంద్‌ రోజున అత్యవసరంగా మందులు విక్రయించేందుకు నగరంలో 4 దుకాణాలను మాత్రం అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు ఎంఎన్‌ గుప్తా, ఎస్‌.శ్రీనివాసరావు, కె.సురేష్‌, ఎం.హనుమంతరావు, గణేష్‌, బుజ్జి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement