– జిల్లా పరిషత్తు చైర్మన్ వేణుగోపాలరావు
సామర్లకోట: రెండేళ్లు గడవక ముందే కూటమి ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్తు చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అన్నారు. సోమవారం స్థానిక లారీ స్టాండ్ వద్ద సూర్య ఫంక్షన్ హాల్‌లో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన పార్టీని ఎప్పుడూ ప్రజలు గుర్తు చేసుకొంటారని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్ సీపీ అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలో అధికారం చేపడుతుందని, దానికి ప్రతీ కార్యకర్త నడుం బిగించి కృషి చేయాలన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. గ్రామ స్థాయి నుంచి కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు. గుర్తింపు కార్డుల పరిశీలన కార్యక్రమం వేగవంతం చేయాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, పార్టీ అధినేత పార్టీ కార్యకర్తలకు గుర్తింపు ఇచ్చే విధంగా కార్యాచరణ తీసుకున్నారని, దీనిలో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. పని చేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. తమిళనాడులో సినీనటుడు విజయ్ జగన్‌మోహన్‌రెడ్డి పొటోతో ఎన్నికలలో ప్రచారానికి దిగి విజయం సాధించారనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా బూత్ కమిటీ ఽఅధ్యక్షుడు ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతాయని, దీనిని ప్రతీ కార్యకర్త, బూత్ స్థాయి కార్యకర్త గమనించాలన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో లక్షలాది ఓట్ల తొలగింపే దీనికి నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో కాకినాడ పార్లమెంటు పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, పెద్దాపురం నియోజకవర్గ పరిశీలకుడు నక్కా శ్రీనగేష్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి జగ్గంపేట పరిశీలకుడు నెక్కంటి సాయిప్రసాద్, పార్టీ రాష్ట్ర అయ్యరక సంఘ అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, ఉమ్మడి రాష్ట్ర కార్మిక సంఘ మాజీ నాయకుడు దవులూరి సుబ్బారావు, జిల్లా అధికార ప్రతినిధి ఇనుకొండ విష్ణుచక్రం పాల్గొన్నారు.


