స్థలం విషయంలో వివాదం | - | Sakshi
Sakshi News home page

స్థలం విషయంలో వివాదం

Apr 27 2026 7:30 AM | Updated on Apr 27 2026 7:30 AM

చెయ్యేరులో అగ్రహారంలో ఉద్రిక్తత

రోడ్డుపై గ్రామస్తుల ఆందోళన

కాట్రేనికోన: చెయ్యేరు అగ్రహారంలో కనదుర్గమ్మ ఆలయం పునర్నిర్మాణ స్థలం విషయంలో గ్రామస్తులు, సరిహద్దు రైతు గంథం సుబ్బారావు వర్గానికి మధ్య ఆదివారం వివాదం తలెత్తింది. ఆ గ్రామంలో సుమారు 70 ఏళ్ల కిందట నిర్మించిన కనకదుర్గమ్మ ఆలయం శిథిలం కావడంతో పునర్నిర్మాణానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఆలయం నిర్మాణానికి మరికొంత స్థలం అవసరం కావడంతో సరిహద్దు రైతు గంథం సుబ్బారావును రెండు అడుగుల స్థలం అడిగారు. ఆ రైతు వ్యక్తిగతంగా సర్వే చేయించుకుని ఆలయం తన స్థలంలో ఉందని, ఆలయం ఇక్కడ నిర్మించేందుకు కుదరని తేల్చిచెప్పేశారు. మూడు రోజుల క్రితం స్థలం చుట్టూ సిమెంటు స్తంభాలను వేయించారు. ఆ స్తంభాలను గ్రామస్తులు తొలగించి పాత ఆలయం తొలగించిన స్థలంలో అమ్మవారి విగ్రహాన్ని, చుట్టూ వెదురు తడికలను కట్టారు. పెద్దల సమక్షంలో చర్చలు జరిపినా ఒప్పందం కుదరకపోవడంతో ఆదివారం ఉదయం ఆలయం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. చెయ్యేరు గున్నేపల్లికి చెందిన టీడీపీ నాయకుడు దొరబాబు రైతు గంథం సుబ్బారావులు తన అనుచరులతో వచ్చి ఆలయ స్థలం చుట్టూ ఉన్న తడికలను తొలగించి, అమ్మవారి పంట బోదెలో పడవేసి పనులను అడ్డుకునేందుకు టిప్పరుతో కంకర గుట్టగా వేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని రైతును నిలదీశారు. ఈ నేపథ్యంలో దొరబాబు అనుచరులు, గ్రామస్తులు మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు సర్థిచెప్పేందుకు వచ్చిన మాజీ సర్పంచి చెల్లి సురేష్‌పై దొరబాబు అనుచరులు దాడికి పాల్పడారని స్థానికులు ఆరోపిస్తూ రోడ్డుపై బైటాయించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అమలాపురం రూరల్‌ సీఐ ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసులు, కాట్రేనికోన, ముమ్మిడివరం ఎస్సైలు అవినాష్‌లు బందోబస్తు నిర్వహించారు. ఆలయ స్థలం వివాదంపై గ్రామస్తులు ఫిర్యాదు చేశారని ఎస్సై అవినాష్‌ తెలిపారు. శాంతి కమిటీ వేసి ఇరువర్గాలతో చర్చించి సమస్య పరిష్కరిస్తామని స్థానిక నాయకులు మంతెన మమ్మురాజు, నడింపల్లి సుబ్బరాజు, త్సవటపల్లి నాగు, మంతెన శ్రీనివాసరాజు తదితరులు అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement