పిఠాపురం: నీటి ఎద్దడి, యూరియా కష్టాలు, పెట్టుబడి సమస్యల వంటి అనేక ఒడుదొడుకులకు ఎదురీది మరీ అన్నదాత పడిన మూడు నెలల కష్టాన్ని ఒక్క గాలివాన నేలపాలు చేసింది. పండిన పంట కొద్ది రోజుల్లో చేతికందుతుందనుకున్న వేళ.. కళ్ల ముందే నీళ్లపాలవుతూంటే రైతులు కన్నీరు పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. చండ మార్తాండుడి ప్రతాపంతో బుధవారం పగలంతా జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు. ఈ తరుణంలో గొల్లప్రోలు, తుని తదితర ప్రాంతాల్లో సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకుని, బలమైన ఈదురు గాలులు వీచాయి. చూస్తూండగానే అనుకోని అతిథిలా వచ్చిన వరుణుడు అకాల వర్షం కురిపించి, ప్రజలకు ఉపశమనం కలిగించాడు. కానీ, అన్నదాతలను మాత్రం ఆందోళనలోకి నెట్టేశాడు. పొలాల్లో కోత కోసి, ఆరబెట్టిన వరి పనలు, కళ్లాల్లో ధాన్యపు రాశులు ఈ వర్షానికి తడిసిపోయాయి. వానబారి నుంచి ధాన్యాన్ని కాపాడుకోడానికి రైతులు అనేక వ్యయప్రయాసలకు గురయ్యారు. వర్షంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు భారీ ఈదురు గాలుల తాకిడికి పలుచోట్ల వరి పైరు నేలకొరిగిపోయింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలు, మల్లవరం తదితర ప్రాంతాలతో పాటు తుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. దీంతో, విద్యుత్, కేబుల్ వైర్లు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చెట్టు కూలిపోవడంతో నిలిచిన వాహనాలు
చేబ్రోలు – మల్లవరం రోడ్డులో విరిగిన చెట్టు
ధాన్యం తడిసిపోకుండా బరకాలతో రక్షణ
ఫ అకాల వర్షంతో రైతుల కలవరపాటు
ఫ ఈదురు గాలులకు
నేలకొరిగిన వరి పైరు
ఫ తడిసిన పనలు.. ధాన్యపు రాశులు


